Hindenberg Shuts Down: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూతపడింది. కంపెనీ వ్యవస్థాపకుడు నాట్ ఆండర్సన్ ఈ ప్రకటన చేశారు. జనవరి 2023లో అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా పరిశోధన నివేదికను విడుదల చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇదే, ఆ తర్వాత అదానీ గ్రూప్ షేర్లలో తీవ్ర క్షీణత కనిపించింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అధిపతి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
నాట్ ఆండర్సన్ తన ప్రకటనలో.. “హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను మూసి వేయాలని నేను నిర్ణయించుకున్నాను. గత సంవత్సరం చివరి నుండి నేను కుటుంబం, స్నేహితులు, మా బృందంతో చర్చిస్తూనే ఉన్నాను” అని అన్నారు. దర్యాప్తు ఆలోచనల పైప్‌లైన్‌ను పూర్తి చేసిన తర్వాత కంపెనీని మూసివేయాలనే ఆలోచన ఉందని ఆండర్సన్ అన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇటీవలే పోంజీ పథకాలకు సంబంధించిన దాని చివరి ప్రాజెక్టును పూర్తి చేసింది. దీంతో దాని కార్యకలాపాలను ముగించింది.
అదానీ గ్రూప్ మోసం ఆరోపణలు
జనవరి 2023లో అదానీ గ్రూప్ స్టాక్‌ను షార్ట్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు.. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఎల్‌ఎల్‌సి, అదానీ గ్రూప్ స్టాక్‌లు వాటి వాల్యుయేషన్ కంటే 85 శాతం ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో ఈ గ్రూప్ మార్కెట్ తారుమారు, అకౌంటింగ్ మోసానికి పాల్పడిందని కూడా ఆరోపించింది. ఈ నివేదిక విడుదలైన తర్వాత అదానీ గ్రూప్ షేర్లలో భారీ తగ్గుదల కనిపించింది. దీని తరువాత, అదానీ గ్రూప్ షేర్ల మార్కెట్ క్యాప్ రూ. 10 లక్షల కోట్లకు పైగా పడిపోయింది. ఈ నివేదిక వెలువడిన తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO)ను రద్దు చేయాల్సి వచ్చింది.
ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూప్
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై అదానీ గ్రూప్ స్పందిస్తూ.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రచురించిన నివేదిక మమ్మల్ని ఆశ్చర్యపరిచిందన్నారు. ఎందుకంటే వారు మమ్మల్ని సంప్రదించకుండా లేదా సరైన వాస్తవాలను ధృవీకరించకుండానే ఈ నివేదికను ప్రచురించారని విమర్శించారు. ఈ నివేదిక సెలక్ట్ చేసిన తప్పుడు సమాచారం, భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానాలు పరీక్షించి తిరస్కరించిన పాత, నిరాధారమైన, పరువు నష్టం కలిగించే ఆరోపణలే అని అదానీ గ్రూప్ పేర్కొంది. అదానీ గ్రూప్ కూడా నివేదిక సమయంపై ప్రశ్నలు లేవనెత్తింది.