Air India : ఒకప్పుడు అంటే ఏ ప్రాంతానికైనా ప్రయాణించాలి అంటే.. బస్సులు లేదా రైలు ప్రయాణ సాధనాలుగా ఉండేవి. కోవిడ్ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ద్విచక్ర వాహనాల కొనుగోలు తారస్థాయికి చేరింది. వ్యక్తిగత వాహనాల కొనుగోలు కూడా పెరిగింది. ఇదే క్రమంలో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య కూడా గతంతో పోలిస్తే పెరిగింది. ఫలితంగా విమానయానం అనే లగ్జరీ కూడా అందుబాటులోకి వచ్చింది. విమానయాన సంస్థలు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటించడంతో చాలామంది మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు.. ఓ నివేదిక ప్రకారం వచ్చే 10 సంవత్సరాలలో భారతదేశ విమానయాన పరిశ్రమ లక్షల కోట్లకు చేరుకుంటుందని ఒక అంచనా.. ఈ నేపథ్యంలో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.. అయితే అందులో టాటా సన్స్ ఆధీనంలోని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికుల కోసం కొత్త ఆఫర్ తీసుకువచ్చింది.
ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న తర్వాత టాటా సన్స్ గ్రూప్ రకరకాల ప్రయోగాలు చేస్తోంది. నష్టాలలో ఉన్న ఎయిర్ ఇండియాను లాభాల బాట పట్టించేందుకు అనేక విధానాలను తెరపైకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే తన ప్రయాణికుల కోసం కొత్త ఆఫర్ తీసుకువచ్చింది. టాటా సన్స్ నెట్వర్క్ పరిధిలో ఉన్న తన విమానాల్లో నమస్తే వరల్డ్ సేల్ అనే ఆఫర్ ప్రకటించింది. శుక్రవారం ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 5 వరకు కొనసాగుతుందని టాటా సన్స్ ప్రకటించింది. ఆ ప్రకటన ప్రకారం ఎయిర్ ఇండియా పరిధిలోని నెట్వర్క్ విమానాల్లో దేశీయ మార్గాలలో 1799, విదేశాల్లోని కేంద్రాలకు 3899 టికెట్ తో ప్రయాణించవచ్చు. అదే బిజినెస్ క్లాస్ టికెట్ ధర దేశీయ మార్గాల్లో అయితే 10,899 తో ప్రయాణం కొనసాగించవచ్చు.
ప్రస్తుతం ఎటువంటి సెలవుల సీజన్ కాకపోయినప్పటికీ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్ ప్రకటిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇక దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ఆ సంస్థ ముమ్మరం చేసింది. “ముందు వచ్చిన వారికి ముందు” సిద్ధాంతం ప్రకారం ఈ విధానం అమలవుతుందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా టికెట్ బుక్ చేసుకున్న వారికి కన్వీనెన్స్ ఫీజు, బుక్ ఫీజు మాఫీ అవుతుందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. అంతేకాదు అమెరికా, కెనడా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఇండియా వివరించింది.
చార్జీలు ఇలా
భారత్ నుంచి అమెరికా వన్ వే 22,283, రిటర్న్స్ 54,376, ఇండియా నుంచి యూరప్ రూ. 22,283 వన్ వే, 39,244 రిటర్న్స్, ఇండియా నుంచి గల్ఫ్, మిడిల్ ఈస్ట్ రూ. 7,714 వన్ వే, 13,547 రిటర్న్స్, ఇండియా నుంచి సింగపూర్ రూ. 6,772 వన్ వే, రూ . 13,552 రిటర్న్స్, ఇండియా నుంచి మెల్బోర్న్ 29,441 వన్ వే, రూ. 54,206 రిటర్న్స్, ఇండియా నుంచి ఖాట్మండు 3,899 వన్ వే, రూ. 9,600 రిటర్న్స్ గా చార్జీలు వసూలు చేస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది.