AC Power Consumption: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. వేడిని తట్టుకోలేక చాలామంది ఏసీలను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఏళ్లుగా ఏసీ వాడుతున్నా 1.5 టన్నుల ఏసీ గంటకు ఎంత విద్యుత్ వినియోగించుకుంటుందో చాలా మందికి తెలియదు. ప్రతి వేసవిలో ఏసీ వల్ల కరెంటు బిల్లు భారీగా పెరిగిపోతుంది. అందుకే 1.5 టన్నుల ఏసీ రోజుకు 8 గంటలు పనిచేస్తే 30 రోజుల తర్వాత ఎంత కరెంట్ బిల్లు వస్తుందో ఈ కథనంలో అంచనా వేద్దాం.
1.5 టన్నుల 5 స్టార్ ఏసీ విద్యుత్ వినియోగం
బజాజ్ ఫిన్‌సర్వ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. 1.5 టన్నుల ఏసీ గంటకు 1.5 కిలోవాట్ (1500 వాట్స్) విద్యుత్‌ను వినియోగిస్తుంది. మీరు రోజుకు 8 గంటలు ఏసీ వాడితే ఒక రోజులో (8 గంటల్లో) ఏసీ 12 కిలోవాట్-గంటల (kWh) విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఈ లెక్కన 30 రోజుల్లో 30 * 12 kWh అంటే 360 kWh (యూనిట్లు) ఖర్చవుతుంది. మీ ప్రాంతంలో విద్యుత్ ధర ఒక యూనిట్‌కు రూ.7 ఉంటే 1.5 టన్నుల ఏసీ కేవలం దాని వల్లనే దాదాపు రూ.2520 విలువైన విద్యుత్‌ను వినియోగిస్తుంది.
Also Read : మీ ఏసీ కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా..? అయితే ఇలా చేస్తే సగం తక్కువ అవుతుంది..
ఇది కేవలం ఏసీ బిల్లు మాత్రమే. ఇంట్లో ఏసీతో పాటు అనేక ఇతర ఎలక్ట్రికల్ ఉపకరణాలు కూడా పనిచేస్తాయి కాబట్టి మీ మొత్తం విద్యుత్ బిల్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం తర్వాత కచ్చితమైన విద్యుత్ బిల్లు ఎంత వస్తుందో చెప్పడం కష్టం.. ఎందుకంటే ప్రతి వ్యక్తి విద్యుత్ వినియోగం వారి వాడకం మీద ఆధారపడి ఉంటుంది.
1.5 టన్నుల 3 స్టార్ ఏసీ విద్యుత్ వినియోగం
1.5 టన్నుల 3 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ ఒక గంట పనిచేస్తే 1.6 kWh (యూనిట్) విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఈ లెక్కన రోజుకు 8 గంటలు ఏసీ పనిచేస్తే 12.8 kWh (యూనిట్లు) ఖర్చవుతుంది. 30 రోజుల ప్రకారం 384 kWh (యూనిట్లు) ఖర్చవుతుంది. మీ ప్రాంతంలో విద్యుత్ ధర యూనిట్‌కు రూ.7 ఉంటే, మీ విద్యుత్ బిల్లు రూ.2688 వరకు వచ్చే అవకాశం ఉంది.
మీ రాష్ట్రాన్ని బట్టి కరెంట్ బిల్లు పెరగొచ్చు.. లేదా తగ్గొచ్చు. అంతేకాకుండా ఈ బిల్లు మీ వినియోగంపై కూడా ఆధారపడి ఉంటుంది. మీరు సరైన ఉష్ణోగ్రతలో ఏసీని నడపడానికి బదులుగా 16 డిగ్రీల వద్ద నడపడం ప్రారంభిస్తే విద్యుత్ బిల్లులో పెరుగుదల ఖచ్చితంగా ఉంటుంది.