BJP- TDP: గత ఎన్నికల నాటి నుంచి చంద్రబాబు రాజకీయంగా చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వైసీపీ ఏకపక్ష విజయంతో టీడీపీ శ్రేణులు కొన్నాళ్ల పాటు నైరాశ్యంలోకి వెళ్లిపోయాయి. అయినా రాజకీయ చాణుక్యుడిగా పేరుపొందిన చంద్రబాబు మాత్రం పోరాటం ఆపలేదు. అటు శాసనసభలో, బయట విపత్కర పరిస్థితులు ఎదురైనా దైర్యం వీడలేదు. గత ఎన్నికల్లో బీజేపీని వదులుకోవడం ద్వారా మూల్యం చెల్లించుకున్న విషయాన్ని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఎన్నికల ముందూ దేశవ్యాప్తంగా కాలికి బలపం కట్టుకొని తిరిగి మరీ మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.కయ్యానికి కాలు దువ్వారు. దశాబ్దాలుగా సైద్ధాంతిక విభేదాలున్న కాంగ్రెస్ తో చేతులు కలిపారు. కానీ అవేవీ ఎన్నికల్లో ఆయన్ను గట్టెక్కించలేదు సరికదా.. తిరిగి మెడకు చుట్టుకున్నాయి. ప్రతికూల పరిస్థితులను తెచ్చిపెట్టాయి. తత్వం బోధపడిన చంద్రబాబు ఎన్నికల అనంతరం బీజేపీకి దగ్గరయ్యేందుకు చాలారకాల ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ ఫలించడం లేదు. గత అనుభవాల దృష్ట్యా బీజేపీ పెద్దలు దరికి చేరనివ్వడం లేదు. అయితే చంద్రబాబు మాత్రం ఏ ప్రయత్నాలు వదలడం లేదు. సంఖ్యాబలంగా తక్కువగా ఉన్నా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు మద్దతు తెలిపారు. అటు కలిసి నడవాలనుకున్న పవన్ ను కూడా బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేయాలని సూచించారు. అయితే ఎన్నిరకాల ప్రయత్నాలు చేయాలో అన్నిరకాలుగా చేస్తున్నా బీజేపీ పెద్దలు మాత్రం మెత్తపడడం లేదు. అయితే రాష్ట్రపతి ఎన్నికల తరువాత సీన్ మారింది. ఇటీవల మాత్రం బీజేపీ నుంచి టీడీపీకి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. స్నేహ హస్తం అందుతుందోని సమాచారం.లోపయికారీగా కొన్ని అంశాలపై సారుప్యత వస్తున్నట్టు వినికిడి. అయితే ఈ పరిణామాలకు వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలే కారణమని తెలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
సెటిలర్స్ ఓటర్లపై గురి..
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తో బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో తొలి టార్గెట్ తెలంగాణపైనే పెట్టుకుంది. గడిచిన ఎన్నికల నాటి నుంచి బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపొంది గట్టి సవాల్ నే విసిరింది. మరోవైపు అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ ల నుంచి చేరికలను ప్రోత్సహిస్తోంది. అయితే ఇప్పుడున్న బలం చాలదని.. బలం పెంచుకోక తప్పదని.. అందివచ్చిన అవకాశాలను వదులుకోకూడదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ప్రధాన సామాజిక ఓటర్లతో పాటు సెటిలర్ష్ ఇప్పుడు కీలకంగా ఉన్నారు. తెలంగాణలో 110 నియోజకవర్గాలకుగాను 40 నియోజకవర్గాల్లో సెటిలర్స్ గెలుపోటమును నిర్దేశించే పాత్రలో ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రా ఓటర్లు అధికం.
Also Read: CM Jagan: మూడేళ్లకు తత్వం బోధపడిందా?.. గట్టి హెచ్చరికలతోనే జగన్ జనం బాట
వారంతా స్వరాష్ట్రంలో తెలుగుదేశం సానుభూతిపరులు. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో వీరు కీలకమవుతారు. ఇది గమనించే తెలంగాణ సీఎం కేసీఆర్ మొన్నటిమొన్న అన్ని నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యంగా సెటిలర్స్ అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దగ్గరుండి కార్యక్రమాలు జరిపించారు. ఇదంతా సెటిలర్స్, టీడీపీని అభిమానించే ఓటర్ల కోసమేనని అనుమానాలు వెల్లువెత్తాయి, ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దల చెవిలో వేశారు. దీంతో బీజేపీ పెద్దలు డిఫెన్స్ లో పడ్డారు. దీనిని అడ్డుకోవడానికి ఉన్న మార్గాలను అన్వేషించారు. అప్పుడే వారికి చంద్రబాబు మైండ్ లోకి వచ్చారు. చంద్రబాబును రంగంలోకి దించడం ద్వారా సెటిలర్స్ ఓట్లు అందిపుచ్చుకోవాలన్న ఆలోచన చేశారు. ఏపీలో పొత్తు పెట్టకోవడం ద్వారా అటు ఆంద్రతో పాటు ఇటు తెలంగాణలో సెటిలర్ష్ అభిమానాన్ని చూరగొనవచ్చన్నది బీజేపీ పెద్దల భావన. అందుకే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లూరి విగ్రహావిష్కరణకు రావాలని చంద్రబాబును ఆహ్వానించారు. వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా నేరుగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును చంద్రబాబు వద్దకు పంపించడం వెనుక ఉన్న రహస్యం కూడా ఇదే కారణంగా తెలుస్తోంది. మొత్తానికైతే చంద్రబాబుకు బీజేపీ దగ్గరయ్యేందుకు కేసీఆర్ ఒక కారణంగా చెప్పొచ్చు.
వైసీపీతో విభేదాలు..
మరోవైపు ఏపీలో కూడా వైసీపీ వ్యవహార శైలి బీజేపీకి రుచించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలకు కాకుండా స్వప్రయోజనాలను ఆశించి స్నేహహస్తం అందిస్తుండడంతో బీజేపీ పెద్దలకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. పైగా ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటుతుండడంతో బీజేపీ పునరాలోచనలో పడింది. ఇటీవల అఖిలపక్ష సమావేశంలో ఏపీకి కేంద్రం హెచ్చరికలతో కూడిన సూచనలు ఇచ్చిన సంగతి తెలిసిందే జాగ్రత్తపడకుంటే శ్రీలకం పరిస్థితులు వచ్చే అవకాశముందని హెచ్చరించింది. దీనిపై వైసీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. పొరుగు రాష్ట్రం తెలంగాణతో కలిసి కేంద్రంపైనే విమర్శలు గుప్పించింది. ఇది బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. పైగా కేసీఆర్ జగన్ కు అత్యంత సన్నిహితుడు. తప్పనిసరైన పరిస్థితుల్లో జగన్ తమతో ఉన్నాడని.. అవకాశం వస్తే కేసీఆర్ తో జత కలుస్తారని కేంద్ర పెద్దలు అనుమానిస్తున్నారు. అందుకే చంద్రబాబు రూపంలో తెలుగు రాష్ట్రాల్లో స్నేహితుడ్ని ఉంచుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. పైగా జగన్, కేసీఆర్ లు చంద్రబాబుకు బద్ద శత్రువులుగా ఉన్నారు. తాజా పరిణామాలన్నీ కలిసి వస్తుండడంతో చంద్రబాబు ఆనందపడుతున్నారు.
Also Read:Draupadi Murmu- BJP: ద్రౌపది ముర్ముతో బిజెపికి ఎంత లాభం అంటే
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Bjps hand of friendship to tdp is the reason for kcr and jagans actions
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com