మరికొన్ని రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. పండగల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉద్యోగులకు నగదు కానుక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నగదు కానుకకు సంబంధించిన ఫైలుపై ఇప్పటికే జవహర్ రెడ్డి సంతకం చేశారు.
టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ పదవీ బాధ్యతలు చేపట్టాక ఉద్యోగులకు బ్రహ్మోత్సవాలకు సంబంధించి కానుక ఇచ్చే ఫైలుపై సంతకం చేయడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని చెప్పారు. నగదు కానుకలో భాగంగా 21 కోట్ల రూపాయలు ఉద్యోగుల కోసం టీటీడీ ఖర్చు చేయనుందని వెల్లడించారు. టీటీడీ పర్మినెంట్ ఉద్యోగులకు 14 వేల రూపాయలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 6,850 రూపాయలు చెల్లించనుందని తెలుస్తోంది.
టీటీడీ నగదు కానుకను అనుబంధ ఉద్యోగులకు అందజేయనుందని తెలుస్తోంది. మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ గురించి టీటీడీ వైపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మూడు వారాల క్రితం టీటీడీ ఆనంద నిలయం బయట నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని వెల్లడించింది. అయితే కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో టీటీడీ బ్రహ్మోత్సవాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాల్సి ఉంది.
గతంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏ విధంగా నిర్వహించిందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉత్సవాలను నిర్వహించాలని టీటీడీ భావిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా నగదు కానుక ఇవ్వడంపై టీటీడీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.