విజయనగరం జిల్లా రామతీర్థంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం బీజేపీ నాయకుల దీక్ష భగ్నం చేసి వారిని అరెస్టు చేయడంతో రాజకీయంగా వేడి వాతావరణం నెలకొంది. రామతీర్థంలోని రాముడి విగ్రహం ధ్వంసానికి నిరసనగా బీజేపీ ఇక్కడ దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసింది. రాములవారి విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ హైందవ సంఘాల ఆధ్వర్యంలో చలో రామతీర్థానికి పిలుపునిచ్చారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి హైందవ స్నాఘల నేతలు రామతీర్థానికి వస్తున్నారు. మరోవైపు ఆదివారమే మంత్రులు కూడా రావడంతో ఈ ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. కాగా బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాలను పోలీసులు తొలగించి, నాయకులను అరెస్టు చేశారు.