Nara Lokesh : యువగళం దారి తప్పుతోందా.. లోకేష్ కు అదే మైనస్

ప్రస్తుతం  ప్రొద్దుటూరులో సైతం అదే రకమైన వివాదం ఎదురువచ్చింది.  ప్రస్తుతం పార్టీలో అదే  చర్చకు కారణమవుతోంది. ఇలా ఎటుచూసినా కాస్తా కన్ఫ్యూజన్ కనిపిస్తోంది.

Written By: Dharma, Updated On : June 2, 2023 4:02 pm
Follow us on

Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్ర దారి తప్పుతోందా? విపక్షాలకు అస్త్రంగా మారుతోందా? పార్టీలో అయోమయానికి కారణమవుతోందా? పార్టీ బలోపేతం కంటే డ్యామేజ్ అధికమా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. టీడీపీని అధికారంలోకి తేవడంతో పాటు తన నాయకత్వాన్ని మరింత పదును పెట్టుకునేందుకు వీలుగా లోకేష్ పాదయాత్రకు సిద్ధపడ్డారు. సుమారు 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్ పేరిట ఉన్న రికార్డును తిరిగిరాయాలన్న కసితో లోకేష్ ముందుకు సాగుతున్నారు. అయితే కొన్నిరకాల మైనస్ పాయింట్లు ప్రతికూలంగా మారుతున్నాయి. ప్రస్తుతం సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పాదయాత్ర కొనసాగుతోంది. సక్సెస్ చేసేందుకు టీడీపీ శ్రేణులు గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి.

మరో 20 రోజుల్లో కడపలో పాదయాత్ర పూర్తికానుంది. రాయలసీమ నుంచి కోస్తాలో లోకేష్ అడుగుపెట్టనున్నారు.  వచ్చే నెల నుంచి పవన్ కల్యాణ్ వారాహి ద్వారా గోదావరి జిల్లాల్లో తన యాత్ర ప్రారంభించబోతున్నారు. రాయలసీమలో అంచనాకు మించి లోకేష్ యాత్ర సాగినట్టు టీడీపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. జనాదరణ, అధికార పక్షం ఆటంకాలను అధిగమించి పాదయాత్ర కుదురుకున్నా.. లోకేష్ వ్యవహార శైలితో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. లోకేష్ ప్రజలతో మమేకమవుతున్నారు. కానీ అధికారంలోకి వస్తే చేయబోయే మేలు గురించి చెప్పడం కంటే స్థానిక వివాదాలకు ప్రాధాన్యతనిస్తున్నారన్న టాక్ ఉంది.

విపక్ష నేతగా జగన్ సుదీర్ఘ కాలం పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఆయన్ను అధిగమించడమే లోకేష్ లక్ష్యం. కానీ జగన్ విపక్ష నేతగా, సీఎం అభ్యర్థిగా పాదయాత్ర చేయడంతో దారిపొడవునా ప్రజలకు ఎన్నోరకాల హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే చేయబోయే మంచి పనుల గురించి ప్రజలకు తెలియజేశారు. లోకేష్ విషయంలో ఆ పరిస్థితి లేదు. ఆయన సీఎం అభ్యర్థి కారు.కేవలం తన తండ్రి సీఎం అయితే చేయబోయే పనులు మాత్రమే చెప్పగలరు. ఇలా ఇస్తున్న హామీలను ఎలా అమలుచేయగలరో మాత్రం చెప్పడం లేదు. ఇది కూడాి ఒక మైనస్ గా మారింది.

లోకేష్ పార్టీలో చంద్రబాబు తరువాతి స్థానంలో ఉన్నారు. పాదయాత్రలో భాగంగా అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా సంకేతాలు ఇవ్వటం..ఇప్పుడు తాను అభ్యర్థులను ఖరారు చేయలేదని చెప్పటం పార్టీలో చర్చకు కారణమవుతోంది. అదే సమయంలో నియోజకవర్గాల్లో వర్గాలు ఉన్న చోట కొంత మందికే లోకేష్ ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. కర్నూలు జిల్లాలో అదే జరిగింది. ప్రస్తుతం  ప్రొద్దుటూరులో సైతం అదే రకమైన వివాదం ఎదురువచ్చింది.  ప్రస్తుతం పార్టీలో అదే  చర్చకు కారణమవుతోంది. ఇలా ఎటుచూసినా కాస్తా కన్ఫ్యూజన్ కనిపిస్తోంది.