Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Women Leaders: వైసీపీలో మహిళా నేతలకు కలిసి రావట్లే

YSRCP Women Leaders: వైసీపీలో మహిళా నేతలకు కలిసి రావట్లే

YSRCP Women Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు మామూలుగా ఉండవు. ఆయన అవసరం మేరకు మాత్రమే రాజకీయం చేస్తారు. అవసరం ఉంటేనే ప్రోత్సహిస్తారు. లేకుంటే మాత్రం ఇట్టే పక్కన పడేస్తారు. తాజాగా బుల్లితెర నటి, యాంకర్ శ్యామల విషయంలో కూడా అదే జరుగుతోంది. గత పది నెలలుగా ఆమె పార్టీ కార్యాలయం వైపు కనిపించడం లేదు. కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ పెట్టడం లేదు. ఆమెను దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టేసినట్లేనని ప్రచారం నడుస్తోంది. ఒక వర్గం ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వైసిపిలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె తనంతట తాను ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జగన్ పట్ల విధేయతను ప్రదర్శించారు. అప్పటినుంచి ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మహిళా నేతలు పెద్దగా కలిసి వచ్చిన దాఖలాలు లేవు. ఎక్కువ రోజులు ఆ పార్టీలో పని చేయలేరు కూడా.

* కొండా సురేఖకు డ్యామేజ్..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు తెలంగాణకు చెందిన కొండా సురేఖ దంపతులు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించి వైసీపీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ధైర్యంగా ఆయన వెంట అడుగులు వేసింది మాత్రం కొండా సురేఖ. రాజశేఖర్ రెడ్డి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి సైతం మాట తప్పడు, మడమతిప్పడు అని భావించి చేరారు. కానీ 2014 ఎన్నికల్లో చంద్రబాబు కోసం కేసీఆర్ తో ఒప్పందం చేసుకున్న తీరును తట్టుకోలేకపోయారు కొండా సురేఖ. జగన్ వెంట నడిచి ఆమె చాలా రాజకీయంగా నష్టపోయారు. మళ్లీ 2023 లో రేవంత్ రూపంలో ఆమె పొలిటికల్ కెరీర్ ప్రారంభం అయింది. ఇప్పటికీ ఆమె జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ద్వేషంతో ఉంటారు. రాజకీయంగా వాడుకుని వదిలేసే తత్వం అని విమర్శిస్తుంటారు.

* వాసిరెడ్డి పద్మ ఆవేదన..
వాసిరెడ్డి పద్మ పరిస్థితి కూడా అదే. ప్రజారాజ్యం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పద్మ. ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉండేవారు. వైసిపి ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. మంచి పొలిటికల్ కెరీర్ ఇస్తారని భావించారు. కచ్చితంగా చట్టసభలకు పంపిస్తానని హామీ ఇచ్చారు. దీంతో వాసిరెడ్డి పద్మ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాయిస్ బలంగా వినిపించేవారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. ఆ పదవి ద్వారా వాసిరెడ్డి పద్మతో రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే ప్రయత్నం చేశారు. అయితే చట్టసభలకు పంపుతాను అన్న జగన్మోహన్ రెడ్డి హామీని బలంగా నమ్మారు పద్మ. అందుకే అప్పట్లో దూకుడుగా ఉండేవారు రాజకీయ ప్రత్యర్థులపై. కానీ 2024 ఎన్నికల్లో టికెట్ అడిగితే కనీసం పట్టించుకోలేదు కదా.. చాలా తక్కువ చేసి మాట్లాడారట. అందుకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసారు వాసిరెడ్డి పద్మ.

* శ్యామలకు పొమ్మన లేక పొగ..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు మాజీ మంత్రి రోజా. అయితే ఆమెకు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అవమానాలు తట్టుకొని ఉండి పోవాల్సి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ఆమెను సొంత పార్టీ వారే ఓడించారు. ఆమెకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదిపారు. అయినా సరే ఏం చేయలేని నిస్సహాయత ఆమెది. ఈసారి కూడా నగిరి టిక్కెట్ ఆమెకు ఇచ్చే అవకాశం లేదని ప్రచారం నడుస్తోంది. ఆ కారణంతోనే ఆమె ఇప్పటికీ రాజకీయ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసి జగన్ కళ్ళల్లో ఆనందం చూస్తున్నారన్న టాక్ ఉంది. అయితే ఇప్పుడు యాంకర్ శ్యామల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి బుల్లితెర అవకాశాలు పోగొట్టుకున్నారు. దీంతో ఆమెకు అధికార ప్రతినిధి అనే ట్యాగ్ ఇచ్చి అవకాశం కల్పించారు. ఆమెను ఇప్పుడు పొమ్మన లేక పొగ పెడుతున్నారు అనేది పొలిటికల్ వర్గాల్లో ఉన్న వాదన. ఆమె సైతం సెల్ఫీ వీడియో విడుదల చేసి దానికి బలం చేకూర్చారు. మొత్తానికైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు ఆశించిన స్థాయిలో గౌరవం దక్కనట్లే..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular