YSRCP Visakhapatnam Crisis: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి షాక్ మీద షాక్ లు పగులుతున్నాయి. ముఖ్యంగా విశాఖ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. దీంతో ఒక్కో పదవి కోల్పోవాల్సి వస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. మొన్నటికి మొన్న విశాఖ మేయర్ పదవి పోయింది. తెలుగుదేశం పార్టీ తన్నుకు పోయింది. అయితే ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంది. జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర పై అవిశ్వాసానికి సొంత పార్టీ జడ్పిటిసిలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈరోజు వారంతా సమావేశమై తీర్మానానికి సంబంధించి నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెపై 16 మంది జడ్పిటిసిలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో టిడిపి ఒకటి, సిపిఎం మరొక జడ్పిటిసి పదవి దక్కించుకున్నాయి. అసంతృప్త జడ్పిటిసిలు అవిశ్వాసం పెడితే తప్పకుండా నెగ్గుతుంది అన్న టాక్ వినిపిస్తోంది.
Also Read: ఆ మాజీ ఎంపీ రీఎంట్రీ.. ఏకంగా రాజ్యసభకేనట!
సర్వసభ్య సమావేశానికి సభ్యుల డుమ్మా..
గత నెలలో నిర్వహించిన జిల్లా పరిషత్( Jila Parishad) సర్వసభ్య సమావేశానికి 22 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కు షాక్ ఇచ్చినట్లు అయింది. ఆమె ఒంటెద్దు పోకడలతో విసిగిపోయామని.. తప్పకుండా మార్చాలని వారు కోరుతూ వచ్చారు. ఇప్పటికే ఓసారి అనకాపల్లిలోని ఓ హోటల్లో అసంతృప్తి జడ్పిటిసిలంతా సమావేశం అయినట్లు తెలుస్తోంది. సుభద్ర కు ప్రత్యామ్నాయంగా జిమాడుగుల జడ్పిటిసి సభ్యురాలు మత్స్యరాస వెంకటలక్ష్మి చైర్ పర్సన్ గా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కొందరు సభ్యులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కానీ హై కమాండ్ నుంచి సరైన నిర్ణయం రాకపోవడంతో అసంతృప్తి ఎమ్మెల్యేలు దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో ప్రచారం నడిచింది.
ఈరోజు ఓ రిసార్ట్స్ లో సమావేశం..
అయితే తాజాగా ఈరోజు అసంతృప్త జడ్పిటిసి లంతా దేవరపల్లిలోని( Devarapalli ) ఓ రిసార్ట్స్లో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సుభద్రను కొనసాగించవద్దని.. అవసరం అనుకుంటే ఎదురు తిరుగుదామని.. తిరుగుబాటు చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. జడ్పిటిసి లతో నేరుగా మాట్లాడారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గమని.. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుభద్రను మార్చాల్సిందేనని వారంతా తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: రాహుల్ గాంధీతో చేతులు కలిపిన జగన్?
వైసీపీకి దక్కని పట్టు..
విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టు అంతంతే. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే పరిస్థితి. విశాఖను రాజధానిగా ప్రకటించిన సమయంలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల అక్కడ సానుకూలత వ్యక్తం కాలేదు. 2019 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించినా.. విశాఖ నగరంలో మాత్రం సత్తా చాట లేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు ఒక్కొక్కటి చేజారుతున్నాయి. అయితే జిల్లా పరిషత్ చైర్పర్సన్ విషయంలో అధికార టీడీపీ కూటమి నుంచి ఎటువంటి ప్రయత్నాలు లేవని తెలుస్తోంది. అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమని కూటమి నేతలు తేల్చి చెబుతున్నారు. మొత్తానికి అయితే విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది.