Galla Jayadev Political Reentry: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఓ మాజీ ఎంపీ సిద్ధపడుతున్నారు. పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్. అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. పారిశ్రామిక కుటుంబానికి చెందిన జయదేవ్ అమర్ రాజా కంపెనీని నిర్వహిస్తున్నారు. ఆది నుంచి గల్లా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి తో మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఆ కుటుంబాన్ని టిడిపిలోకి తీసుకొచ్చారు చంద్రబాబు. ఎంతో ప్రాధాన్యమిచ్చారు. అయితే 2019 నుంచి 2024 మధ్య జరిగిన పరిణామాలతో గల్లా జయదేవ్ ఎన్నికల కు ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అయితే ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలో ఉండడం.. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో తిరిగి పార్టీలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: శభాష్ సిరాజ్.. తండ్రి కష్టానికి గుర్తింపు తెచ్చావ్.. దేశాన్ని సగర్వంగా నిలబెట్టావ్!
* రాజకీయ నేపథ్య కుటుంబం..
చిత్తూరు జిల్లాలో( Chittoor district ) గల్లా కుటుంబానికి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. గల్లా రామచంద్ర నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అయితే అమెరికాలో ఉంటూ చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమలో నిరుద్యోగుల కోసం అమర్ రాజా కంపెనీని ఏర్పాటు చేశారు. రామచంద్ర నాయుడు తర్వాత ఆ కుటుంబం రాజకీయంగా తెర మరుగైంది. అయితే 2003లో రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు గల్లా అరుణకుమారి. 2004, 2009 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆమె. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. 2014 వరకు మంత్రిగా కొనసాగారు. 2014 ఎన్నికలకు ముందు కుమారుడు గల్లా జయదేవ్ తో కలిసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి అరుణ కుమారి, గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి జయదేవ్ పోటీ చేశారు. జయదేవ్ గెలిచారు కానీ అరుణకుమారి ఓడిపోయారు.
* గెలిచే అవకాశం ఉన్నా..
2014, 2019 ఎన్నికల్లో గెలిచారు జయదేవ్( Galla Jaidev ). జగన్ ప్రభంజనాన్ని సైతం తట్టుకొని నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో సైతం గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే రాజకీయాల కంటే పారిశ్రామికవేత్తగానే గల్లా జయదేవ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వేలకోట్ల పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమలు ఉన్నాయి. 2018లో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావడం.. తదనంతర పరిణామాలతో లోక్సభలో తెలుగుదేశం పార్టీ వాయిస్ ను బలంగా వినిపించారు. అదే సమయంలో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. ఒకవైపు అప్పటి కేంద్ర పెద్దల దృష్టిలో పడడం.. ఏపీలో వైసిపి ప్రభుత్వం అమర్ రాజా కంపెనీని వెంటాడడం వంటి కారణాలతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తెలుగుదేశం పార్టీపై విశ్వాసం చూపుతూనే క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కానీ టిడిపి నాయకత్వంతో సంబంధాలు మాత్రం కొనసాగించారు. అయితే జయదేవ్ ఖాళీ చేసిన గుంటూరు సీటును అనూహ్యంగా మరో పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు. ఎంపీగా గెలవడమే కాదు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. గల్లా జయదేవ్ మరోసారి పోటీ చేసి ఎంపీగా గెలిచి ఉంటే.. కచ్చితంగా కేంద్రమంత్రి అయ్యుండేవారు.
* కాణిపాకంలో క్లారిటీ..
అయితే తెలుగుదేశం అధికారంలోకి రావడం.. కేంద్రంలో కీలక భాగస్వామి కావడంతో గల్లా జయదేవ్ కు మంచి పదవి దక్కుతుందని అంతా భావించారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తారని అంచనా వేశారు. కానీ చంద్రబాబు మాత్రం ఈసారి నేతలను కాకుండా.. సీనియర్ అధికారులను ఆ పదవిలో నియమించారు. అయితే గత కొద్దిరోజులుగా గల్లా జయదేవ్ కనిపించలేదు. నిన్ననే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద ప్రత్యక్షం అయ్యారు. హర్యానా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ సింగ్ చౌదలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. పొలిటికల్ రీ ఎంట్రీ పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నపై స్పందించారు. దేవుడి అనుగ్రహం, నా అవసరం ఉంటే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. పార్టీ పెద్దలతో చర్చిస్తున్నానని.. రాజ్యసభ ఎంపీగా వస్తాను అంటూ తేల్చి చెప్పడం విశేషం. దీంతో గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీ పై ఫుల్ క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.