Jagan Rahul Gandhi Alliance: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ కాంగ్రెస్ కు దగ్గరవుతోందా? ఆ పార్టీకి మద్దతు తెలుపుతుందా? రాహుల్ గాంధీకి మద్దతుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం దేనికి సంకేతం? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీని విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అదే సమయంలో సిద్ధాంత పరంగా వ్యతిరేకం అయిన బిజెపితో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీతో జతకలవాల్సిన అనివార్య పరిస్థితి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది.
Also Read: ఏపీ అభివృద్ధికి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్!
ఈవీఎంలపైనే అనుమానం..
2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) కూటమి ఘనవిజయం సాధించింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పలేదు. కేవలం 11 సీట్లకే ఆ పార్టీ పరిమితం అయ్యింది. అయితే టిడిపి ఇంతటి ఘన విజయానికి కారణం ఈవీఎం లేనని వైసిపి అనుమానిస్తోంది. దీనిపై గట్టి పోరాటమే చేస్తోంది. ప్రత్యేకంగా డిపాజిట్లు కట్టిమరి విచారణ కోరుతోంది. ఒకటి రెండుసార్లు ఎన్నికల కమిషన్ ముందు కూడా హాజరైంది. ఈవీఎంలపై అనుమానాలు, పోలింగ్ నాడు సాయంత్రం వరకు ఓటర్లు బారులు తీరడం వంటి వాటిని ఈసీ కి ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి రోజా లాంటి వారైతే ఈవీఎంల వైపే తరచూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టిడిపి కూటమి విజయాన్ని.. ఈవీఎంల విజయం గా అభివర్ణిస్తున్నారు.
ఎన్నికల నిర్వహణపై రాహుల్ గరం..
అయితే జాతీయస్థాయిలో ఇప్పుడు ఇదే అంశంపై గళం ఎత్తుతున్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ( Rahul Gandhi). ఎలక్షన్ కమిషన్ సరైన చర్యలు తీసుకోవడం లేదని.. తన అనుమానాలు అలాగే ఉన్నాయని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కొత్త ఓటర్ల చేరిక వెనుక కుట్ర కోణం ఉందని మండిపడుతున్నారు. ఇదంతా నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ తీరు బాగాలేదని ఉదహరిస్తూ చెబుతున్నారు రాహుల్ గాంధీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చాలా రకాల తప్పిదాలు జరిగాయని.. అనేక రకాల అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు రాహుల్. అయితే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. తద్వారా ఏపీలో సైతం అక్రమాలు జరిగినట్లు రాహుల్ గాంధీ ఆరోపించినట్లు అయింది. దీంతో వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్టులు రాహుల్ గాంధీని సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి వైసిపి దగ్గరవుతుందా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి.
Also Read: జగన్ ప్రైవేట్ సైన్యం!
ఏపీలో ఎన్డీఏ మాత్రమే..
అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ( National democratic Alliance) కూటమి బలంగా ఉంది. కానీ ఇండియా కూటమికి కనీస ప్రాతినిధ్యం లేదు ఏపీలో. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో కూడా లేదు. ఒక విధంగా చెప్పాలంటే తటస్థ వైఖరితోనే ఉన్నారు. జాతీయస్థాయిలో రెండు కూటమిలతో సంబంధం లేకుండా.. టిడిపి తో పాటు జనసేన ను మాత్రమే ప్రత్యర్థిగా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. దానికి కారణం తనపై ఉన్న కేసులే. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందిస్తే.. కచ్చితంగా ఆయనకు ఇబ్బందికరమే. అందుకే ఆయన రాహుల్ గాంధీతో చేతులు కలిపే ఛాన్స్ లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.