YSRCP Protest : ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టిడిపి కూటమి విజయకేతనం ఎగురవేసింది. భారీ అంచనాలతో పోటీచేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయితే ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరచూ ఆరోపిస్తోంది. కూటమి ఏడాది పాలనలో కనీసం సంక్షేమ పథకాలు అమలు చేయలేని విషయాన్ని ప్రస్తావిస్తోంది. అందుకే నేటికీ ఎన్నికల ఫలితాలు వెల్లడై ఏడాది ముగుస్తున్న సందర్భంగా వెన్నుపోటు దినం జరుపుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. అయితే అనూహ్యంగా కూటమి తీసుకున్న నిర్ణయాలతో బాధితులుగా మిగిలిన వారితో ఆందోళన కార్యక్రమాలు జరిపిస్తోంది. ప్రస్తుతం కేసుల భయంతో కీలక నేతలు ఈ ఆందోళన కార్యక్రమానికి డుమ్మా కొట్టగా.. ప్రభుత్వ బాధిత వర్గాలుగా మిగిలిన వాలంటీర్లు, ఎండియు ఆపరేటర్లతో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టింది.
Also Read : ప్రజా తీర్పుదినం.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంచలన కామెంట్స్!
* కొన్ని నియోజకవర్గాల్లో ఫెయిల్..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం( Vennupotu Dhinam) ఆందోళన కార్యక్రమాలు జరపాలని హై కమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపి ప్రజల్లోకి కూటమి వైఫల్యాలను తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే అన్ని జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే కీలకమైన నియోజకవర్గాల్లో నేతలు ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అక్కడ కిందిస్థాయి క్యాడర్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహణతో ప్రజల్లో ఒక రకమైన కదలిక రావచ్చని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది.
* వేమూరులో భారీ నిరసనలు..
కొన్నిచోట్ల మాత్రం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ క్యాడర్ గట్టిగానే ఆందోళనలు జరుపుతోంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో అయితే రేషన్ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వాటికి మోసపోయాం, వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక ఫ్లెక్సీలు అమర్చారు. అవి ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఆ ఫ్లెక్సీలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీల ప్రస్తావన ఉంది. జూన్ నెలకు సంబంధించి ఎం డి యు వాహనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. పాత పద్ధతిలోనే రేషన్ డిపోల వద్ద సరుకులు అందిస్తున్నారు. దీంతో ఎండీయూ వాహనదారులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. అందుకే వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించారు.
* ఆ రెండు వర్గాలే అధికం..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వెన్నుపోటు దినం పిలుపునకు నాయకులకంటే ప్రభుత్వ బాధిత వర్గాలు స్పందించాయి. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏడాది అవుతున్న వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం స్పందించలేదు. వారి నియామకం కూడా ఉండే పరిస్థితి లేదని స్పష్టమైంది. తాజాగా ఎండియు వాహనదారులు కూడా రోడ్డున పడ్డారు. వారు కూడా ప్రభుత్వ బాధిత వర్గాలే. అందుకే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి వాలంటీర్లతో పాటు ఎండియు వాహనదారులు ఎక్కువగా మద్దతు తెలిపారు. అటువంటి చోట్ల ఆందోళన కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి.
వేమూరు నియోజకవర్గం లో రేషన్ వ్యాన్ ల తో వెన్నుపోటు దినోత్సవం.#1YearForCBNBackStabbing ❌❌❌ pic.twitter.com/W9uuf3Zjan
— Bhaskar Reddy (@chicagobachi) June 4, 2025