YSR Congress Internal Crisis: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో రోజురోజుకు సంక్షోభం ముదురుతోంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఎంతలోన చాలామంది అనుకూలురు పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. పార్టీకి సంబంధించి అనుకూల మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇలా అంత వ్యతిరేకంగా మారిపోయింది. మీడియా డిబేట్లో పాల్గొనే వారి నుంచి.. తెర వెనుక కంటెంట్ తయారు చేసే వారి వరకు అంతా చీలిపోయారు. వ్యతిరేక స్వరం వినిపిస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గందరగోళం నెలకొంది.
* ఆ ఇద్దరి కట్టడి కష్టం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో( social media) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకులు పాషా, కె ఎస్ ప్రసాద్ రెచ్చిపోతూ మాట్లాడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. వారేకాకుండా తెర వెనుక చాలామంది సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియాకు సేవలందిస్తున్న వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ కార్యవర్గాల కంటే.. సోషల్ మీడియా ప్రతినిధులే కీలకం. అటువంటి వారు ఇప్పుడు వ్యతిరేకిస్తుండడంతో పార్టీలో సంక్షోభ వాతావరణం నెలకొంది.
* సజ్జల టార్గెట్..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా( digital media) విభాగ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సకాలంలో చెల్లింపులు లేక ఎదురు తిరుగుతున్న వారికి ఏం చెప్పాలో తెలియక ఆయన చేతులెత్తేశారు. దీంతో అటువంటి వారంతా ఇప్పుడు సజ్జలను టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా సజ్జలను కోవర్ట్ తో పోల్చుతున్నారు. ఈ చెల్లింపుల విషయంలో చాలామందికి అన్యాయం జరుగుతోంది. ఐ ప్యాక్ వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఇలా ఒప్పందం మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పని చేశారు. అయితే పని చేయని వారికి లక్షల్లో జీతాలు చెల్లించి.. పనిచేస్తున్న వారికి మొండి చేయి చూపుతున్నారు. ఇక మీదట సాక్షి డిబేట్లకు వెళ్ళనని కేఎస్ ప్రసాద్ తేల్చి చెప్పారు. భాషా సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. పరస్పరం ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్న ఆ ఇద్దరు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసుకుంటున్నారు. ఒక విధంగా పాము పెంచి పోషించుకున్న పాములు బుసలు కొడుతున్నాయి.