Diesel Shortage Andhra Pradesh: రాజకీయ పార్టీలు( political parties) ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. అందులోనూ ప్రతిపక్ష పార్టీలు మరీ జాగ్రత్త తీసుకోవాలి. అప్రమత్తంగా అడుగులు వేయాలి. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజులు ఇవి. ఇటువంటి సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ఇబ్బందికరమే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఇబ్బంది ఇప్పుడు ఎదురయింది. రాష్ట్రవ్యాప్తంగా డీజిల్ కొరతపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కేవలం ప్రధాన ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయి ఆందోళనలు. అక్కడ కూడా ప్రజలు వచ్చింది లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను గుర్తించినది లేదు. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో చేసిన ఆందోళనలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.
* ఆదరణ కరువు..
రాజమండ్రిలో ఆందోళనలు నిర్వహించారు. పట్టుమని పదిమంది కూడా లేరు. ఆపై మాజీ ఎంపీ మార్గాని భరత్ అసహనం వ్యక్తం చేస్తూ.. పెట్రోల్ బంక్ ముందు ఖాళీ డబ్బాలు కావాలని కార్యకర్తలను అడిగారు. పనిలో పనిగా లారీ ఇక్కడికి తీసుకురా ఫ్రీగా పెట్రోల్ కొట్టిస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఇంతలో ఒక ఆటో రాగా.. అందులో ఉన్న డ్రైవర్ డీజిల్ కావాలా? అంటూ అడగగా.. మార్గాని భరత్ ఫ్రీగా కొట్టిస్తావా అంటూ చెప్పుకొచ్చారు. గత రెండు రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియోలో రెండు అంశాలు బయటకు వచ్చాయి. ఒకటి డీజిల్ కొరత లేదని.. రెండు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు ప్రజలు పెద్దగా లెక్క చేయలేదని స్పష్టం అవుతుంది. డీజిల్ ఫ్రీగా కొట్టిస్తాం ఆందోళనలకు రండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తద్వారా డీజిల్ కొరత లేదని వారే స్వయంగా చెప్పినట్టు అయ్యింది.
* తేలిపోయిన వైసీపీ ఆందోళనలు..
వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలు ఉన్నారు. ఇంతలోనే డీజిల్ కొరత తలెత్తింది. దీనిని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకొని ఆందోళనలు చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవడంతో డీజిల్ నిల్వలు అన్ని బంకులకు పుష్కలంగా చేరుకున్నాయి. ఒకవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు సక్రమంగా జరగకపోగా.. ఇటువంటి చర్యలతో తిరిగి ఆ పార్టీ ట్రోల్స్ కు గురవుతోంది.