YSRCP Richest Party: ప్రాంతీయ పార్టీలకు( Regional parties ) విరాళాల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి తన సత్తా చాటింది. 2024-25 లో భారీగా విరాళాలు దక్కించుకున్నట్లు కేంద్ర ఆడిట్ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. భారత ఎన్నికల సంఘానికి ఆ రాజకీయ పార్టీలు సమర్పించిన విరాళాల ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 140 కోట్ల రూపాయలకు పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు రావడం విశేషం. వైసిపి అధికారానికి దూరమైనా.. ఆ పార్టీ ధనిక పార్టీగా గుర్తింపు దక్కించుకోవడం విశేషం.
* గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి
గత కొన్ని సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలకు విరాళాలు విషయంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ తొలి 5 స్థానాల్లో కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు అధికారానికి దూరమైన ఆ పార్టీకి విరాళాలు తగ్గడం లేదు. సాధారణంగా రాజకీయ పార్టీలకు విరాళాలు అనేవి కామన్. అన్ని పార్టీలకు విరాళాలు అందించే సంస్థలు, పారిశ్రామిక యాజమాన్యాలు ఉంటాయి. అయితే ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఫలానా పార్టీ తమకు మంచి చేసిందన్న కోణంలో ఆలోచించి ఈ విరాళాలు ఉంటాయి. వైసిపి 2019 నుంచి 2024 మధ్య అధికారంలో ఉంది. స్వతహాగా జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తగా రాణించారు. ఆపై దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. అందుకే భారీగా విరాళాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్లు తెలుస్తోంది.
* జగన్ బీద అరుపులు
వైసిపి అధికారం కోల్పోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) చాలా సందర్భాల్లో పార్టీ నడిపేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేశంలోనే అత్యంత ధనవంతుడైన నేతగా జగన్మోహన్ రెడ్డికి గుర్తింపు ఉంది. ఆపై ఈ భారీ స్థాయిలో విరాళాలు చూస్తుంటే మాత్రం వైసిపి ధనిక పార్టీగా ముద్ర వేసుకుంటోంది. వైసిపి హయాంలో రాజభవనాలు లాంటి పార్టీ కార్యాలయాలను ప్రతి జిల్లాలో నిర్మించారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆ కార్యాలయాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నోటీసులు ఇచ్చింది. అయితే ఆ వివాదం సద్దుమణిగింది. వైసీపీకి విరాళాలు ఇచ్చిన పరిశ్రమల జాబితాలో పేరు మోసిన సంస్థలు కూడా ఉన్నాయి. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఆ సంస్థలు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సైతం క్రియాశీలకంగా ఉన్నాయి.