YSR Midday Meals Scheme: అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు కొనసాగుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ శాసనసభక్ష నాయకుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇప్పటికంటే అప్పుడు మరింత సందడిగా ఉండేది. ఒక రకంగా ఆ పార్టీ కార్యాలయం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో సమానంగా కిటకిటలాడుతూ ఉండేది పైగా ఇప్పుడున్నంత గొప్ప స్నేహం కాంగ్రెస్ పార్టీ, టిడిపి మధ్య లేదు. ఎప్పుడు చూసినా ఉప్పు నిప్పు వ్యవహారమే. అందువల్ల టిడిపి ఇన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయాల్లో రకరకాల రాజకీయ చర్చలు జరుగుతూ ఉండేవి. అప్పుడు మీడియాలో కూడా ఈ స్థాయిలో వార్తలు విస్ఫోటనం ఉండేది కాదు. అప్పట్లో ఇంకా 24 గంటలపాటు న్యూస్ ఛానల్స్ రాలేదు. ఇక అప్పుడు టిడిపి అధికారంలో ఉంది కాబట్టి.. ప్రధాన మీడియా చంద్రబాబు వంత పాడేది. కాంగ్రెస్ పార్టీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య నాయకుడిగా ఉన్నారు కాబట్టి.. నాటి రోజుల్లో ఆయనకు సింహభాగం ప్రాధాన్యం దక్కేది కాదు. రాజశేఖర్ రెడ్డి నాడు పార్టీ కార్యాలయంలో కొంతమంది మీడియా ప్రతినిధులతో కలుపు గోలుగా మాట్లాడేవారు. ఆరోజు కూడా కొంతమంది మీడియా ప్రతినిధులను పార్టీ కార్యాలయంలో ఆహ్వానించారు. సరిగా సమయం మధ్యాహ్నమైంది. భోజనం చేయడానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూర్చున్నారు. ఆయనకు ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది. ఆ సమయంలో మీడియా ప్రతినిధులను ఖాళీ కడుపుతో పంపిస్తే బాగోదని భావించి.. వారిని కూడా భోజనానికి కూర్చోమన్నారు. శాసనసభ పక్ష నాయకుడు.. పైగా ప్రతిపక్ష నాయకుడు భోజనం చేద్దామని అనడంతో వారు కూడా కాదనలేకపోయారు.
Also Read: YSR Congress : జగన్ కు అండగా రాజశేఖర్ రెడ్డి విధేయులు.. త్వరలో వైసీపీలోకి ఉండవల్లి!
వైయస్ రాజశేఖర్ రెడ్డి తాను ఆహారం తింటూనే.. మీడియా ప్రతినిధులకు కొసరి కొసరి వడ్డిస్తున్నారు. ఈలోగానే మధ్యాహ్నం భోజనం గురించి ఒక చర్చ వచ్చింది.. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మధ్యాహ్నం భోజనం పెట్టే కంటే.. గుడ్డు పెట్టడం మంచిది అని పేర్కొన్నారు. అది చిన్నపాటి చర్చగానే మిగిలిపోతుందని రాజశేఖర్ రెడ్డి అనుకున్నారు. మీడియా ప్రతినిధులు కూడా భావించారు. కానీ ఇంతలో ఏం జరిగిందో తెలియదు.. ఆ సమాచారం బయటకు వెళ్లిపోయింది. మరుసటి రోజు టిడిపి మీడియాగా పేరు పొందిన పత్రికలలో పిల్లల నోటికాడ ముద్దను రాజశేఖర్ రెడ్డి లాగిస్తున్నారని వార్తలు ప్రచురితమయ్యాయి. ఆ వార్త కనిపించగానే టిడిపి నాయకులు ఆందోళనకు దిగారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిణామం రాజశేఖర్ రెడ్డి కి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. తనకు అత్యంత సన్నిహితులైన మీడియా మిత్రులతోనే రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. అంతలోనే సమాచారం బయటకి ఎలా వెళ్ళిందో ఆయనకి కూడా అర్థం కాలేదు. చివరికి తన వేగులను గాంధీభవన్లో కూడా ఏర్పాటు చేశారని.. అప్పట్లో వైయస్ తన సన్నిహితులతో అనేవారట. అయితే ఆ విషయంపై రాజశేఖర్ రెడ్డి క్లారిటీ ఇచ్చినప్పటికీ టిడిపి అనుకూల మీడియా వదిలిపెట్టలేదు. పైగా ఆ విషయాన్ని గోరంతలు కొండంతలు చేసింది. వాస్తవానికి ఈ పరిణామమే కాంగ్రెస్ పార్టీకి సొంత మీడియా ఉండాలి అనే ఆలోచనను రాజశేఖర్ రెడ్డిలో కలిగించిందని.. ఆయనకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులు చెబుతుంటారు. ఇక ఈ పరిణామం తర్వాత రాజశేఖర్ రెడ్డి మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టారు.