YSR Congress Party: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వ్యూహాత్మకంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా చేసే ప్రయత్నాలు బాగా ఆకట్టుకుంటాయి. ప్రధానంగా సినీ హీరోల అభిమానులను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో వైసిపి చేసే రాజకీయం మామూలుగా ఉండదు. ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ హీరోల అభిమానులను వారికి తెలియకుండానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టర్న్ చేసుకోగలదు. అంత గొప్ప వ్యూహం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం. టిడిపి కూటమికి సినీ గ్లామర్ ఉంది. నందమూరి తో పాటు ఇతర సినీ పెద్దల అభిమానం ఉంది. జనసేనకు మెగా కాంపౌండ్ వాల్ నుంచి బలమైన సపోర్ట్ లభిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆ స్థాయిలో లేదు. అందుకే ప్రముఖ హీరోల అభిమానులను వైసీపీ వైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియాలో పెద్ద ప్రయత్నమే చేసింది. ఆ హీరోలంతా జగన్మోహన్ రెడ్డికి అభిమానులు అన్నట్టు సోషల్ మీడియాలో బిల్డప్ ఇస్తోంది.
* ప్రభాస్ తమ వాడేనంటూ..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో అటువంటి ప్రచారమే చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఆయన బిజెపిలో ఉండేవారు. బిజెపి నేతగానే చనిపోయారు. ఒకానొక దశలో కృష్ణం రాజు జనసేనలో చేరుతారని అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే ఆయన అకాల మృతి చెందారు. ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కృష్ణంరాజు స్వగ్రామంలో పెద్ద కర్మ నిర్వహించారు. ఆ సమయంలో అయితే రాజశేఖర్ రెడ్డి పై కృష్ణంరాజుకు ఎంతో అభిమానం ఉండేదన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సహజంగానే రాజకీయ సినీ రంగాలకు దగ్గర సంబంధాలు ఉంటాయి. అప్పట్లో కృష్ణంరాజును రాజా అని రాజశేఖర్ రెడ్డి సంబోధించేవారని స్వయంగా రెబల్ స్టార్ ప్రకటించారు. దానిని పట్టుకొని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తమ వాడే అన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే దీనిని గుర్తించిన కృష్ణంరాజు భార్య ఏకంగా కూటమికి మద్దతు ప్రకటించడంతోపాటు ప్రచారం చేశారు. అయినా సరే ఇప్పటికీ ప్రభాస్ అభిమానులను వైసీపీ వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు.
* జూనియర్ ఎన్టీఆర్ విషయంలో..
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను సైతం వైసీపీ నిత్యం ఆకర్షిస్తూనే ఉంటుంది. నందమూరి, నారా ఫ్యామిలీలతో జూనియర్ ఎన్టీఆర్ కు గ్యాప్ ఉందంటూ ప్రచారం చేయడంలో వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా ముందుంటుంది. మంత్రి నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలో తొక్కేశారు అంటూ ప్రచారం చేయడంలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పాత్ర ఉంది. సినిమాలే ప్రపంచం గా బతుకుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. రాజకీయాల గురించి పట్టించుకునే స్థాయిలో లేరు ఆయన. అయితే అయిన దానికి కానీ దానికి ఫ్యాన్స్ మధ్య విభజన రేఖ గీసి.. వారిని తమ వైపు తిప్పుకునే పనిలో ఉంటుంది వైయస్సార్ కాంగ్రెస్. ఎప్పటికప్పుడు చంద్రబాబుతో పాటు లోకేష్ కు చెక్ పెట్టాలని జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తీసుకొస్తూ వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
* మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్..
అల్లు అర్జున్ విషయంలో అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అతిగా వ్యవహరించింది అని చెప్పవచ్చు. మెగా కాంపౌండ్ వాల్ నుంచి అల్లు అర్జున్ ను వేరుచేసి చూపడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. మొన్నటి ఎన్నికలకు ముందు తనకు అత్యంత ఆత్మీయుడైన ఓ వైసిపి అభ్యర్థికి సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్. అది మొదలు అల్లు అర్జున్ తమ వాడే అని చెప్పుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆయన సినిమాలు విడుదలైనప్పుడు హంగామా చేస్తూనే ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకొని.. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అలా అల్లు అర్జున్ అభిమానులను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం అన్నమాట.
* పాత అనుబంధంతో మహేష్ బాబు పై..
మహేష్ బాబును సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వదల్లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో సూపర్ స్టార్ కృష్ణకు మంచి సంబంధం ఉండేది. కృష్ణ వియ్యపురాలు గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. కృష్ణ సిఫారసులతో రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఆమెను క్యాబినెట్లో తీసుకున్నారని కూడా ఒక టాక్ ఉంది. పైగా స్వతహాగా ఎన్టీఆర్ను వ్యతిరేకించిన కృష్ణ కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘకాలం కొనసాగారు. అయితే రాజశేఖర్ రెడ్డి పై ఉన్న గౌరవంతోనే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు జగన్ వెంటే అడుగులు వేశారు. అక్కడ తగినంత ప్రాధాన్యం లేకపోవడంతోనే ఆదిశేషగిరిరావు టిడిపిలోకి వచ్చేసారు. గల్లా అరుణ కుమారి తో పాటు ఆమె కుమారుడు జయదేవ్ సైతం టిడిపిలోకి వచ్చారు. జయదేవ్ స్వయానా మహేష్ బాబు బావ. రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన జయదేవ్ ను వెంటాడారు జగన్మోహన్ రెడ్డి. అందుకే మొన్నటి ఎన్నికలకు ముందు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు జయదేవ్. అయినా సరే మహేష్ బాబును తమ వాడిగా చూపి ఓట్లు కొల్లగొట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే సోషల్ మీడియా యుగం కాబట్టి ప్రజలకు అన్ని తెలుసు. ముఖ్యంగా హీరోల అభిమానులకు సైతం నేటి రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఓట్ల కోసం తపన పడుతోంది.