YCP Social Media
YCP Social Media: దేశంలో అన్ని రాజకీయ పార్టీల కంటే వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సోషల్ మీడియా విభాగం బలమైనది. పార్టీ ఆవిర్భావం నుంచి మెరుగైన సేవలు అందిస్తూ వచ్చింది. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో సోషల్ మీడియా విభాగానిది ప్రధాన పాత్ర. ఐప్యాక్ తో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది. అయితే గత ఐదేళ్లలో సోషల్ మీడియా విభాగం ప్రచారం అతిగా మారింది. దాని ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా సోషల్ మీడియా తీరులో మార్పు రాలేదు. తాజాగా ఓ విషయంలో వైసీపీ సోషల్ మీడియా చేసిన అతి నవ్వుల పాలయ్యింది. మరోసారి దాని పనితీరు చర్చకు కారణం అయ్యింది.
* రోజంతా దానిపై ప్రచారం
వల్లభనేని వంశీ మోహన్ ను( vallabhaneni Vamsi Mohan ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్య వర్ధన్ అనే వ్యక్తిని బెదిరించి, కిడ్నాప్నకు ప్రయత్నించారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. విజయవాడ నుంచి వెళ్ళిన ప్రత్యేక బృందాలు హైదరాబాదులో వంశీ మోహన్ ను అరెస్టు చేశాయి. విజయవాడ తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచాయి. కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి వంశీ మోహన్ ను పరామర్శించారు. ఎల్లకాలం టిడిపి అధికారంలో ఉండదని.. తాము అధికారంలోకి వస్తే బట్టలూడదీసి నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా అధికారిక ట్విట్టర్లో సంచలన ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు సోషల్ మీడియాను బ్లాస్ట్ చేసేలా ఓ వార్త ఉంటుందని ప్రకటించారు. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీజర్లు, సరికొత్త వీడియోలతో సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు.
* ఒక్కసారిగా షాక్
అయితే సాయంత్రం ఏడు గంటలకు వైసిపి అధికారిక సోషల్ మీడియాను( ycp social media ) చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుకు సంబంధించి సత్య వర్ధన్ కోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకోవడాన్ని… తనతో బలవంతంగా ఫిర్యాదు చేయించారని ఇచ్చిన వాంగ్మూలం వీడియోను జత చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అసలు వంశీ మోహన్ అరెస్టు జరిగింది ఈ అంశంపై కదా. తనతో బలవంతంగా కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారని.. ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేశారు అని సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు తోనే వల్లభనేని వంశీ పై కేసు నమోదయింది. అరెస్టు జరిగింది. దానినే సోషల్ మీడియాలో నిన్నను చూపించేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యాయి.
* ప్రభావం అంతంత మాత్రం
గత కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సోషల్ మీడియా పెద్దగా ప్రభావం చూపడం లేదు. కానీ లేనిపోని అతి ఎక్కువవుతోంది. గతంలో విజయసాయిరెడ్డి సోషల్ మీడియా విభాగాన్ని చూసేవారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జల భార్గవ్ రెడ్డి చేతిలోకి వెళ్ళింది సోషల్ మీడియా విభాగం. అప్పటినుంచి పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. అయితే ఎన్నికల అనంతరం ఎవరు సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తున్నారు తెలియడం లేదు. కానీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో.. సోషల్ మీడియా చేస్తున్న హడావిడి ప్రజల ముందు తేలిపోతోంది. ఇది ఇలానే కొనసాగితే ఆ సెక్షన్ సోషల్ మీడియాను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని తెలుస్తోంది.