YSR Congress party : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) ఎమ్మెల్యేలు సభకు హాజరవుతున్నారా? శాసనసభ సమావేశాలకు వస్తున్నారా? వస్తే ఎందుకు కనిపించడం లేదు? రిజిస్టర్లో సంతకాలు పెడుతున్న వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు దీనిపైనే స్పష్టమైన ప్రకటన చేశారు. అసలు వారు ఎందుకు రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారు? అనర్హత వేటు పడుతుందనా? లేకుండే ఎమ్మెల్యే అలవెన్సులు రావన్న భయమా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తిగా మారింది.
* ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది సభ్యులు ఎన్నికయ్యారు. జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) పులివెందుల నుంచి గెలిచారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వర రాజు, అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధలు గెలిచారు. వీరంతా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసే తొలి సమావేశానికి హాజరయ్యారు. అటు తరువాత వైసిపికి ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా సభకు హాజరు కావడం లేదు.
* అనర్హత వేటుకు భయపడి..
అయితే వరుసగా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు హాజరు కాకుంటే మాత్రం అనర్హత వేటు పడుతుందని అధికార పార్టీ నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల( assembly budget sessions ) తొలి రోజున జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కొద్దిసేపు సభలో ఉండి రిజిస్టర్లో సంతకాలు పెట్టారు. తరువాత ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెబుతూ సభ నుంచి నిష్క్రమించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు వస్తారని తేల్చి చెప్పారు. మరోవైపు శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం హాజరవుతున్నారు. గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు.
* వారిపై ఆగ్రహం..
అయితే తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వర రాజు, అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధలు సభకు రాకుండా రిజిస్టర్లో సంతకాలు చేశారు. దానిని తప్పుపట్టారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. వారు సభకు వచ్చి గౌరవంగా మాట్లాడవచ్చు అని సూచించారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారని.. ముఖం చాటేయడం ఎందుకని ప్రశ్నించారు. హాజరు పట్టికలో సంతకాలు చేసి సభకు రాకపోవడం వారి గౌరవాన్ని పెంచదు అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ ఏడుగురు వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. అసలు వారు ఎందుకు భయపడి రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు.