YSR Congress Party: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ బలపడకూడదు.. ఆ పార్టీ అధికారంలోకి రాకూడదు. కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న టిడిపి, జనసేన ఇదే లక్ష్యంతో పని చేస్తున్నాయి. 40% ఓటు షేర్ ఉంది కాబట్టి.. తప్పనిసరిగా అధికారంలోకి వస్తామన్న ధీమాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే ప్రజా పోరాటాలు చేయాలని స్ట్రాంగ్ గా నిర్ణయించింది. జగన్మోహన్ రెడ్డి సైతం ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది కూటమి. అందుకే ఆ పార్టీలో మంచి పేరు ఉన్న నేతలను కూటమి పార్టీల్లో చేర్పించేందుకు ఆ రెండు పార్టీలు నిర్ణయించాయి. ఇప్పుడు అదే వ్యూహానికి పదును పెడుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న నేతల జాబితాను సిద్ధం చేస్తోంది కూటమి.
* సైలెంట్ లో ఉన్న నాయకులను..
2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే పార్టీలో కొనసాగుతున్న వారు సైతం సైలెంట్ గా ఉన్నారు. శ్రీకాకుళం( Srikakulam) నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి ఉంది. అటువంటి వారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రప్పించేందుకు కూటమి పార్టీలు పావులు కదపడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. బలమైన నేతలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడం ద్వారా ఆత్మస్థైర్యం పై దెబ్బ తీయవచ్చు అనేది ఒక వ్యూహంగా తెలుస్తోంది. చాలామంది నేతలు వైసీపీలో ఉన్నారు కానీ.. అంత క్రియాశీలకంగా లేరు. అటువంటి వారి జాబితా సిద్ధమవుతోంది.
* ఇప్పటికే చర్చలు ప్రారంభం..
త్వరలో స్థానిక సంస్థల( local bodies) ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు ఆ వ్యూహం రూపొందిస్తూనే వైసీపీ నేతలు చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మహిళా మంత్రి జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత కుటుంబం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు కూడా తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ప్రజల్లో మంచి పేరు ఉండి.. వారి ద్వారా నియోజకవర్గాల్లో రాజకీయంగా మైలేజ్ వస్తుందన్న వారిని కూటమి పార్టీల్లో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతి పూర్తయిన సందర్భంలో.. వచ్చే కొద్ది రోజుల్లో ఈ చేరికలు ఉంటాయని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.