Thammineni Seetharam And Duvvada Srinivas: శ్రీకాకుళం ( Srikakulam)జిల్లాలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ జిల్లా విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ధర్మాన ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సరికొత్త సమీకరణలకు తెర తీశారు. అయితే ఇక్కడ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు మాత్రం ప్రాధాన్యత తగ్గింది. మొన్నటి ఎన్నికల్లో ఆమదాలవలసలో ఓడిపోయారు సీతారాం. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న సీతారాం ను తప్పించి ద్వితీయ శ్రేణి నాయకుడికి బాధ్యతలు కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. అయితే ధర్మాన ప్రసాదరావు ఏడాది కాలం పాటు క్రియాశీలకంగా లేకపోయినా.. ఆయనకు రాష్ట్రస్థాయిలో బాధ్యతలు కట్టబెట్టేందుకు సిద్ధపడుతున్నారు. అయితే తమ్మినేని సీతారాం ఈ చర్యల పట్ల అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* ధర్మానకు కీలక బాధ్యతలు..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ పై( duvvada Srinivas) ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేశారు జగన్మోహన్ రెడ్డి. కుటుంబ వ్యక్తిగత వివాదాలతో ఆయనను దూరం పెట్టారు. అయితే ఈ దూరానికి కారణం ధర్మాన బ్రదర్స్ అని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. మళ్లీ వైసీపీలోకి వచ్చి ధర్మాన బ్రదర్స్ లెక్క తేల్చుతానని హెచ్చరిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ధర్మాన ప్రసాదరావు కు కీలక బాధ్యతలు కట్టబెడతారని తెలుస్తోంది. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయ బాధ్యతలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సమన్వయ బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత మాత్రం దువ్వాడ శ్రీనివాస్ కు మింగుడు పడడం లేదు. మరోవైపు తమ్మినేని సీతారాం సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* ఆ రెండు ఫ్యామిలీలను ఓడించేందుకు..
శ్రీకాకుళం జిల్లాలో కుల రాజకీయాలు ఎక్కువ. కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు దువ్వాడ శ్రీనివాస్, తమ్మినేని సీతారాం. అయితే వెలమ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన ప్రసాదరావు విషయంలో ఆ ఇద్దరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. కానీ వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటు పడింది దువ్వాడ శ్రీనివాస్ పై. అటువంటి నేతతో కలిసి తమ్మినేని సీతారాం ఇప్పుడు పర్యటనలు చేస్తున్నారు. పరామర్శలు చేస్తున్నారు. అయితే ఏదో ప్లాన్ తోనే ఇదంతా చేస్తున్నారన్న అనుమానం ఉంది. వచ్చే ఎన్నికల్లో ధర్మాన ఫ్యామిలీని ఓడిస్తానని దువ్వాడ శ్రీనివాస్ శపథం చేశారు. ఇంకోవైపు కింజరాపు కుటుంబం పై కూడా అదే పరిస్థితి కొనసాగిస్తానని హెచ్చరించారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్లు దక్కకపోతే తమ్మినేని సీతారాం తో పాటు దువ్వాడ శ్రీనివాస్ కొంతమంది అభ్యర్థులను రంగంలోకి దించుతారని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.