YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ రాష్ట్రంలో బలపడేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. జగన్మోహన్ రెడ్డి సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. అన్ని సామాజిక వర్గాల నేతలు మొహరిస్తున్నారు. గత కొద్దిరోజులుగా కాపు సామాజిక వర్గం చుట్టూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు తిరుగుతున్నాయి. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నేతలతో కూడా జగన్మోహన్ రెడ్డి గట్టిగానే మాట్లాడిస్తున్నారు. ఒకవైపు రాజకీయం చేస్తూనే మరోవైపు రాజకీయంగా బలపడాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా ప్రాంతాలవారీగా పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా పార్టీలో సీనియర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా రీజినల్ కోఆర్డినేటర్లను నియమించారు.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
* మారిన రీజియన్లు..
గతంలో ఉత్తరాంధ్రను( North Andhra ) ఒక రీజియన్ గా చూసి నియామకాలు చేపట్టేవారు. ఉత్తరాంధ్రలోని ఉమ్మడి మూడు జిల్లాలకు కలిపి ఒక ప్రాంతీయ సమన్వయకర్తను నియమించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి లాంటివారు వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి ఉత్తరాంధ్రను విడగొట్టారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం ఒక రీజియన్ గా చూపి కోఆర్డినేటర్ గా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును నియమించారు. మరోవైపు విశాఖ, విజయనగరం రీజియన్ కోఆర్డినేటర్ గా మాజీమంత్రి కురసాల కన్నబాబును, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను ఒక రీజియన్ గా చేసి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను, ఉమ్మడి పశ్చిమగోదావరి రీజియన్‌కు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ ను సమన్వయకర్తగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. తద్వారా కీలక నేతలందరికీ బాధ్యతలు అప్పగించినట్టు అవుతుంది.
* కీలక నేతలందరికీ బాధ్యతలు
గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రీజియన్లను విభజించి కోఆర్డినేటర్లను( coordinators ) నియమించేవారు. ఈ నేపథ్యంలో రకరకాల సమస్యలు వచ్చేవి. ఈసారి అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ.. అందరి నేతలకు బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా కోఆర్డినేటర్లను నియమిస్తారని తెలుస్తోంది. త్వరలో జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. అంతకంటే ముందే రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అదే పని మీద ఉన్నారు. మరోవైపు రాష్ట్ర కోఆర్డినేటర్ గా ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన స్థానంలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు నియమిస్తారని ప్రచారం నడుస్తోంది. అయితే మున్ముందు పార్టీ నియామకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి కఠిన నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తారని ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?