YSR Congress : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ( Jagan Mohan Reddy) షాక్ తగలబోతోందా? మరో సన్నిహిత నేత పార్టీని వీడడం ఖాయమా? ఇప్పటికే ఆయన నిర్ణయం తీసుకున్నారా? తనతో పాటు కుటుంబాన్ని సైతం వేరే పార్టీలోకి తీసుకెళ్ళనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూటమి పార్టీలో చేరారు. కొందరైతే పదవులకు రాజీనామా చేసి మరి బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఓ బలమైన కుటుంబం సైతం వైసీపీకి గుడ్ బై చెబుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెర వెనుక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఆ కీలక నేతపై జగన్ ఆగ్రహం.. కోటరీ నుంచి ఔట్!
* బలమైన కుటుంబం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఆళ్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి అదే పార్టీలో కొనసాగుతోంది ఆళ్ల ఫ్యామిలీ. ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయన పార్టీలో బలమైన నేతగా ఉన్నారు. పార్టీకి అండగా నిలబడ్డారు కూడా. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఇతర పార్టీల్లో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఈ తరుణంలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తన ఫ్యామిలీతో జనసేన లోకి వెళ్తారని టాక్ నడుస్తోంది. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం అయోధ్య రామిరెడ్డి పై ఎన్నో రకాల అనుమానాలు కలిగేలా కథనాలు వచ్చాయి. కానీ తాను చివరి వరకు జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటానని ఆయన ప్రకటించారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన జనసేన గూటికి వెళ్తారని తెలుస్తోంది.
* సోదరుడి వెంట రామకృష్ణారెడ్డి..
మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి( all Ramakrishna Reddy ) సైతం సోదరుడిని అనుసరిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి ప్రత్యక్ష రాజకీయాల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉంటే.. వైయస్సార్ కాంగ్రెస్ లో పార్టీ అంతర్గత రాజకీయాలు చేసేవారు అయోధ్య రామిరెడ్డి. 2014లో తొలిసారిగా రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో సైతం రెండోసారి విజయం సాధించారు. మంత్రిగా ఉన్న నారా లోకేష్ పై రికార్డ్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీ అని అంతా భావించారు. మంత్రి పదవి దక్కకపోగా.. 2024 ఎన్నికల్లో మంగళగిరి టిక్కెట్ కూడా ఇవ్వలేదు. అప్పటినుంచి మనస్థాపంతో ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి షర్మిల పిలుపుమేరకు కాంగ్రెస్లో చేరారు. కానీ అక్కడ నెలరోజులు కూడా ఉండలేకపోయారు. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.
* తగినంత గుర్తింపు లేక..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం బలంగా పనిచేసిన ఆళ్ల కుటుంబానికి( Alla family ) తగినంత గుర్తింపు రాలేదన్న అసంతృప్తి ఉంది. 2014 నుంచి 2019 మధ్య టిడిపి ప్రభుత్వం పై న్యాయపోరాటం చేసేవారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండ కట్టడంలో ముందుండేవారు. అదే సమయంలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక పిల్లర్ గా కూడా ఉండేవారు. కానీ వారి సేవలను వినియోగించుకున్న జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు ఇవ్వలేదు. రాజకీయంగా ప్రోత్సహించలేదు. అందుకే జనసేనలో చేరేందుకు వారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.