YSR Congress : విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని( Kesineni Nani ) పక్కా పొలిటికల్ ఎజెండాతో పని చేస్తున్నారా? రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ఆయన చేసిన ప్రకటనలో నిజం లేదా? తమ్ముడు చిన్ని పై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందా? కూటమి సర్కారుని ఇరుకున పెడుతూ వైసీపీకి అనుకూల వాతావరణం క్రియేట్ చేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు నాని. ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన తమ్ముడు చిన్ని చేతిలో ఓడిపోయారు. అయితే మనస్థాపంతో రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం అనుమానాస్పదంగా ఉంది.
Also Read : కూటమిపై విష ప్రచారం.. ప్రత్యేక బృందం వ్యూహం!
తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న చిన్ని ని టార్గెట్ చేస్తూ.. కూటమి ప్రభుత్వాన్ని( Alliance government ) ఇరుకున పెట్టే విధంగా వరుస ట్వీట్లు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ నడుస్తోంది. మాజీ ఎంపీ నాని మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎంపీగా ఓడిన తర్వాత రాజకీయాలకు దూరమని ప్రకటించారు ఆయన. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. అయినా సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న ఆరోపణలు, బహిరంగ లేఖలు చూస్తుంటే మాత్రం వైసీపీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేవలం తన తమ్ముడు చిన్నిని టార్గెట్ చేసుకోవడం ద్వారా కూటమిని ఇరుకున పెడుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* ఒక్కో ఆరోపణతో..
మొదట విశాఖపట్నంలో( Visakhapatnam) ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కు 60 ఎకరాల భూమి కేటాయించడంపై కేసినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సమస్త వెనుక కేశినేని చిన్ని బినామీలు ఉన్నారని పోస్టులు పెట్టారు. సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఆ కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం నడుస్తున్న తరుణంలో లిక్కర్ స్కాం ను తెరపైకి తెచ్చారు. అందులో ఎంపీ కేసినేని చిన్ని పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్ కసిరెడ్డి కంపెనీల్లో చిన్నికి వాటా ఉందని.. చిన్ని కంపెనీల్లో కసిరెడ్డి భాగస్వామిగా.. ఇద్దరూ కలిసి నిధులను విదేశాలకు మళ్ళించారని ఆరోపణలు చేశారు.
* తెర వెనుక రాజకీయం..
అయితే కేశినేని నాని కామెంట్స్ వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) ఆయనతో ఆ మాటలు చెప్పిస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. ఇటువంటి సమయంలో అధికార టిడిపి ఎంపీ పై ఆరోపణలు చేస్తే విచారణ పక్కదారి పడుతుందన్నది వ్యూహంగా తెలుస్తోంది. కేశినేని నాని తెలివిగా చిన్ని పై ఆరోపణలు చేస్తూనే.. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నట్లు కనిపించింది. అయితే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మేలు చేస్తుందో తెలియదు కానీ.. కేశినేని నాని రాజకీయ పునరాగమనానికి మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
* హైదరాబాదులో కీలక సమావేశం..
మాజీ ఎంపీ కేసినేని నాని ఆరోపణలు, పోస్టులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడం పై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరోవైపు నాని చేస్తున్న ఆరోపణలు, పోస్టులను వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి మరి ప్రచారం చేస్తుండడం ఈ అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలతో కేశినేని నాని సమావేశమయ్యారని ఎంపీ చిన్ని ఆరోపించారు. అటు తరువాతనే కేశినేని నాని దీనిపై ఆరోపణలు చేశారని అనుమానించారు. మొత్తానికి అయితే మాజీ ఎంపీ కేసినేని నాని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందన్నది ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.
Also Raed : అమరావతిపై వైసిపి సరికొత్త ఆస్త్రాలు!