https://oktelugu.com/

YS Jagan Mohan Reddy : అసెంబ్లీకి జగన్.. మారిన వ్యూహం!

వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు.

Written By: , Updated On : February 23, 2025 / 10:33 AM IST
YSR Congress chief Jagany attend assembly session

YSR Congress chief Jagany attend assembly session

Follow us on

YS Jagan Mohan Reddy :  ఏపీ ( Andhra Pradesh) రాజకీయాల్లో కీలక పరిణామం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అయితే ప్రభుత్వం తో పాటు స్పీకర్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. కేవలం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే పరిమితం అయ్యారు. అటు తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దూరంగా ఉంది. సాధారణ ఎమ్మెల్యేగా సభలో అవకాశమిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమంటూ జగన్ చెబుతూ వచ్చారు. అయితే బడ్జెట్ సమావేశాలు కావడంతో హాజరైతేనే ఉత్తమమని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్
గత ఏడాది జూన్లో టిడిపి కూటమి( TDP Alliance) ప్రభుత్వం కొలువుదీరింది. అప్పట్లో ఓటాన్ బడ్జెట్ ను కొనసాగించింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో భారీగా హామీలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఆ హామీలు అమలు చేయడానికి నిధులు లేవని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం అసాధ్యమని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం పై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అసంతృప్తి ప్రారంభం అయ్యింది. దీనిని క్యాష్ చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ కేటాయింపులపై నిలదీసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

* రెండు వారాలపాటు సమావేశాలు
రెండు వారాలపాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు( AP assembly budget sessions ) జరగనున్నాయి. రేపు ప్రారంభం కానున్నాయి. జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం బలమైన శక్తిగా ఉంది. 164 స్థానాల్లో విజయం సాధించి.. సంపూర్ణ విజయానికి కూత వేటు దూరంలో ఉండిపోయింది. అయితే ఈసారి మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. ఈ తరుణంలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

* తొలుత ఆ భయంతోనే
గత ఐదేళ్లలో చాలామంది విపక్ష నేతలను అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం వెంటాడింది. జగన్ సర్కార్ బాధిత నేతలు చాలామంది కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరుకానుండడంతో తప్పకుండా వారి నుంచి అటాక్ ఉంటుంది. దీనిని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే గుర్తించారు. అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు భయపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికైతే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి.