AP Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడుగా ఉన్నారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించడం పై ఆందోళన వ్యక్తం చేశారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ వ్యవస్థ వైఫల్యాలను బయటపెట్టారు. ఈ క్రమంలోహోం శాఖ మంత్రి మరింత చురుగ్గా వ్యవహరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పరిస్థితి ఇలానే కొనసాగితే తాను హోం మంత్రి పదవి తీసుకుంటానని స్పష్టం చేశారు. దీంతో ఇదో సంచలన అంశంగా మారిపోయింది. అయితే ఆ వ్యాఖ్యలు అనంతరం ఏపీ క్యాబినెట్ భేటీలో సైతం పవన్ ఇదే విషయాన్ని ప్రస్తావించడం.. అటు తరువాత నేరుగా ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో చర్చలు జరపడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం 15 నిమిషాల సమావేశానికి ఢిల్లీ హుటాహుటిన బయలుదేరి వెళ్లడం ఏమిటి అన్న ప్రశ్న వినిపించింది. అటు జనసేన సైతం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కేవలం పవన్, అమిత్ షా ఫోటోలను విడుదల చేసి చేతులు దులుపుకుంది. అటు అమిత్ షా సైతం దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.బిజెపి సైతం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో వైసిపి సోషల్ మీడియాలో వేరే ప్రచారానికి తెర తీసింది. హోం మంత్రి పదవి కోసమే పవన్ అమిత్ షాను కలిసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అయితే దీనిని జనసేన కొట్టి పారేస్తోంది. పవన్ కు అవసరమైతే హోం మంత్రి పదవి కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని.. దానికి లాబీయింగ్ చేయాల్సిన పనిలేదని తేల్చి చెబుతున్నారు జనసైనికులు.
* ఆ కలయిక వెనుక
మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కలిశారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. వారిద్దరి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం కనిపించింది. అయితే పదవి కోసమే హోం మంత్రితో పవన్ చర్చలు జరిపారన్నది వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణ. గౌరవంగా హోం శాఖ నుంచి తప్పుకోవాలని పవన్ సూచించినట్లు ప్రచారం ప్రారంభమైంది. అయితే ఆ ప్రచారం వెనుక వైసిపి ఉన్నది అన్నది స్పష్టం. దీనిని కూడా జనసైనికులు ఖండిస్తున్నారు. అసలు పవన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని.. హోం శాఖ మంత్రిని తప్పు పట్టలేదని.. వైసిపి హయాం నుంచి శాంతిభద్రతలు క్షీణిస్తూనే ఉన్నాయని.. దానికి కొందరు పోలీస్ అధికారుల వైఖరి కారణమన్నది పవన్ చేసిన ఆరోపణ. వైసీపీ శ్రేణులను హెచ్చరిస్తూనే పవన్ మాట్లాడారని.. తాను హోం శాఖను తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారని గుర్తు చేస్తున్నారు. దానిని రాజకీయంగా మలుచుకుని కూటమి మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నది జనసైనికుల అభిప్రాయం.
* అత్యంత ప్రాధాన్యం
పవన్ కళ్యాణ్ కు కూటమిలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతుంది. అదే ప్రాధాన్యాన్ని దుర్వినియోగం చేయడం లేదు పవన్. ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు జనసైనికులు. పవన్ కు పదవి కావాలంటే బిజెపి నేతల సిఫారసులు అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. ఏపీలో కూటమి వెనుక పవన్ ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలంటున్నారు. సీఎం చంద్రబాబు సైతం పవన్ కు అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇది కేవలం వైసీపీ ప్రచారం మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు.