YS Vivekananda Reddy Case : ఏదైనా నేరంతో తమకు సంబంధం లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరిపించుకోవచ్చని ఎక్కువ మంది సూచిస్తారు. తమ తప్పు లేదన్నప్పుడు విచారణ ఎలా చేస్తే తమకెందుకులే అన్నట్టు ఉంటారు. కానీ మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య కేసులో నిందితులు మాత్రం తమపై విచారణ నిలిపివేయాలని పిటిషన్లు దాఖలు చేయడం విశేషం. 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. అప్పట్లో సిఐడి విచారణకు ఆదేశించింది టిడిపి సర్కార్. అయితే ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ విచారణ చేయాల్సిందేనని పట్టుపట్టారు అప్పటి విపక్షనేత జగన్మోహన్ రెడ్డి. టిడిపి సర్కార్ సిబిఐ విచారణకు ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. సిబిఐ విచారణ అవసరం లేదని తేల్చేశారు. చివరకు వివేకానంద రెడ్డి కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సిబిఐ దర్యాప్తు అనివార్యం అయింది. గత ఐదేళ్లలో సిబిఐ విచారణ కొనసాగింది. దర్యాప్తు ముగించినట్లు సిబిఐ కోర్టుకు నివేదించింది. కానీ అసలు విచారణ జరపకుండా ముగిసింది అని చెప్పడం సరికాదని వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కింది కోర్టులో కేసు విచారణను మళ్లీ ప్రారంభించాలని పిటీషన్ దాఖలు చేయడం విశేషం.
* విచారణ పునః ప్రారంభం..
నాంపల్లి సిబిఐ కోర్టులో( CBI Court) సునీత పిటిషన్ దాఖలు చేశారు. మళ్లీ విచారణ ప్రారంభించాలని సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఇప్పటికే సిబిఐ విచారణ ముగిసిందని.. మరోసారి ప్రారంభించవద్దని ఈ హత్య కేసులో నిందితులు కౌంటర్ పిటిషన్లు వేశారు. ఒక్క అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తప్ప అందరూ పిటిషన్లు దాఖలు చేశారు. వారికి కూడా గడువు ఇచ్చింది కోర్ట్. తప్పకుండా వారుసైతం విచారణ వద్దని కచ్చితంగా పిటిషన్లు దాఖలు చేస్తారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ ప్రమేయం లేదని.. అదంతా కుటుంబ వ్యవహారమని… ఆస్తి కోసమే సునీత, ఆమె భర్త చేయించారని సాక్షిలో ప్రత్యేక కథనాలు రాయించారు. ఆపై గత ఐదేళ్లుగా సిబిఐ విచారణకు వైసీపీ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది. అప్పటి సాక్షాలను సైతం చెరిపేసినట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ ముగిసిన తర్వాత ఇప్పుడు విచారణ ఎందుకన్నది ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల అభిప్రాయం.
* ఏది జరిగినా సంచలనమే..
ప్రస్తుతం నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశాల కోసం యావత్ తెలుగు రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ కోర్టు సిబిఐ విచారణ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని ఆదేశిస్తే సంచలనమే. లేదు ఇప్పటివరకు జరిగిన విచారణ ఓకే అని చెప్పినా సంచలనమే. మరోసారి విచారణ అంటే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. ఎందుకంటే సిబిఐ విచారణకు ఏపీ పోలీస్ శాఖ సంపూర్ణంగా సహకరిస్తుంది. విచారణలో సంచలన అంశాలను బయటపెట్టి అవకాశం ఉంది. స్వేచ్ఛగా విచారణ చేపట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక్క కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారా? లేకుంటే ఆ పై స్థానాల్లో ఉన్నవారు ఉన్నారా? అనేది బయటకు రానుంది. అయితే ఏ క్షణం అయినా నాంపల్లి సిబిఐ కోర్టు.. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి సంచలన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.