YS Sunitha Reddy: సీబీఐ చేయాల్సింది చాలా ఉంది.. వివేక హత్యపై సునీత సంచలన పవర్ పాయింట్ ప్రజెంటేషన్

ఈ హత్య కేసులో సిబిఐ చేయాల్సింది చాలా ఉంది. న్యాయం కోసం ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. ఈ కేసులో సిబిఐ పై రాజకీయ ఒత్తిడి ఉంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో నేను ఇన్ని దృశ్యాలు చూపించాను.

Written By: Anabothula Bhaskar, Updated On : April 15, 2024 4:28 pm

YS Sunitha Reddy sensational power point presentation on Viveka murder

Follow us on

YS Sunitha Reddy: “మీ ఆడబిడ్డలం మీ దగ్గరకు వచ్చాం.. న్యాయం కోసం కొంగు చాచి అడుగుతున్నాం.. మాపై దయ చూపండి” అంటూ ఇటీవల కడపలో వైఎస్ షర్మిల, సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వారు అలా మాట్లాడిన మరుసటి రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి వైఎస్ విమలమ్మ కౌంటర్ ఇచ్చారు. జగన్ కు అనుకూలంగా మాట్లాడారు.. షర్మిల, సునీత కుటుంబం పరువు తీస్తున్నారంటూ ఆరోపించారు. విమలమ్మ అలా మాట్లాడారో లేదో.. సోమవారం సునీత సంచలన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు..

సిబిఐ చేయాల్సింది చాలా ఉంది

“ఈ హత్య కేసులో సిబిఐ చేయాల్సింది చాలా ఉంది. న్యాయం కోసం ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. ఈ కేసులో సిబిఐ పై రాజకీయ ఒత్తిడి ఉంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో నేను ఇన్ని దృశ్యాలు చూపించాను. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైనా వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని భావిస్తారా? హత్య జరిగిన రోజు రాత్రి, తర్వాత రోజు ఉదయం కాల్ డేటా తో పాటు గూగుల్ టేక్ అవుట్ , ఐపిడిఆర్ డేటా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇవన్నీ మా నాన్న హత్యకు గురయ్యారని చెబుతున్నాయి” అంటూ సునీత వ్యాఖ్యానించారు.

అవినాష్ పాత్ర ఉంది

” ఈ కేసులో ఏ -1 ఎర్ర గంగిరెడ్డి, ఏ-2 సునీల్ యాదవ్, ఏ-3 ఉమాశంకర్ రెడ్డి, ఏ-4 దస్తగిరిని సిబిఐ పేర్కొన్నది. ఎర్ర గంగిరెడ్డి కి, ఉమా శంకర్ రెడ్డి తో అవినాష్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి తో సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. వివేకానంద రెడ్డి దగ్గర పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ కేసులో సిబిఐ ఏ-3 గా పేర్కొన్న శివశంకర్ రెడ్డికి, కృష్ణారెడ్డికి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయి. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ అవినాష్ మాత్రం వాళ్లు ఎవరో తెలియదని చెబుతున్నారు. ఫోటోలు, ఫోన్ డేటా చూస్తే అవినాష్ రెడ్డి చెబుతోంది మొత్తం అబద్ధమని తెలుస్తోంది. కడప జిల్లాలో వివేకానంద రెడ్డి బలమైన నాయకుడు. ఆయన బతికి ఉండగా ఆ స్థాయికి చేరుకోవడం అవినాష్ రెడ్డికి సాధ్యం కాదు కాబట్టి అసూయ పడ్డారు. హత్య జరుగుతున్న సమయంలో అవినాష్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఫోన్ మాట్లాడుకున్నారని” సునీత స్పష్టం చేశారు.

విమలపై విమర్శలు

“మా నాన్న వివేకానంద రెడ్డి విమలమ్మకు స్వయానా సోదరుడు. అలాంటి వ్యక్తి చనిపోతే విమలమ్మ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కడపలో మేము చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె విమర్శలు చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసినప్పుడు విమలమ్మ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు?. నా తండ్రి హత్య కేసు విషయంలో నాకు న్యాయం జరిగేందుకు ఎవరితోనైనా మాట్లాడతాను. చివరికి సీఎం జగన్ తో సహా మాట్లాడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. గతంలో దీనికి సంబంధించి చాలాసార్లు జగన్ తో మాట్లాడాను. ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ దొరకడం లేదు. దీనికోసం చాలాసార్లు లేఖలు కూడా రాశాను.” అని సునీత పేర్కొన్నారు

కాగా, వివేకానంద రెడ్డి హత్యకు కొద్ది రోజుల ముందు.. ఒక సభలో వేదికపై అవినాష్ రెడ్డి ఏదో చెబుతున్నప్పటికీ వివేకానంద రెడ్డి పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఆ దృశ్యాలను సునిత ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రదర్శించారు.. అంతేకాదు వివేకానంద రెడ్డి ఇంటి సమీపంలో ఉమా శంకర్ రెడ్డి పరుగులు తీసిన దృశ్యాలు, హత్య అనంతరం సాక్షి పత్రిక, చానల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులు, వైసిపి నాయకులు చేసిన వ్యాఖ్యలను సునీత ప్రముఖంగా ప్రస్తావించారు..”మా నాన్న హత్య జరిగినప్పుడు నేను ఒంటరిని. న్యాయం కోసం ఐదు సంవత్సరాలు నుంచి పోరాడుతున్నాను. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి నాకు మద్దతు లభిస్తోంది. వారికి అసలు విషయాలు తెలియాలనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశానని” సునీత ఈ సందర్భంగా ప్రకటించారు.