Janhvi Kapoor: ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జూలై లో జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ జంట మూడు రోజుల పాటు ముందస్తు పెళ్ళి వేడుక జరుపుకుంది. జామ్ నగర్ ప్రాంతంలో జరిగిన ఆ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా అతిరథమహరథులు తరలివచ్చారు. ఈ వేడుకల కోసం అంబానీ కుటుంబం వందలకోట్లు ఖర్చు చేసింది. హలీవుడ్ పాప్ గాయని రియన్నా నుంచి మొదలుపెడితే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వరకు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఆటలు, పాటలు, నోరూరించే విందు, ప్రత్యేక కార్యక్రమాలతో మూడు రోజుల వేడుక ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమం కోసం వచ్చిన ప్రపంచ స్థాయి సెలబ్రిటీలకు అంబానీ కుటుంబం ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేసింది. అత్యంత విలాసవంతమైన వాహనాలలో జామ్ నగర్ దాక తీసుకొచ్చింది. అక్కడ లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేసింది. ఈ వేడుకల్లో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ కలిసి డ్యాన్స్ చేశారు. తన కోసం కుటుంబం ఎంతో తాపత్రయ పడుతోందని అనంత్ అంబానీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నీతా అంబానీ చేసిన డాన్స్ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
ఈ నేపథ్యంలో రాధికా మర్చంట్ కు ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీకపూర్ పార్టీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. తన స్నేహితులతో జాన్వీకపూర్ రాధిక కు ఈ పార్టీ ఇచ్చింది. జాన్వీ కపూర్ తెల్లనిదుస్తులు ధరించింది. మిగతావారు గులాబీరంగు దుస్తులు ధరించి సందడి చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం సందడిగా సాగింది. అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా, కుమార్తె ఇషా, జాన్వీకపూర్ స్నేహితుడు శిఖర్ పహరియా, ఇతర సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ‘ప్రత్యేకమైన పెళ్ళి కూతురు కోసం ప్రత్యేకమైన పార్టీలో పాల్గొనడం సంతోషంగా ఉందని’ అంటూ జాన్వీకపూర్ ఇన్ స్టా గ్రామ్ రాసుకొచ్చింది. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్నేహితుడు శిఖర్ పహరియా ప్రత్యేక దుస్తులతో కనిపించి సందడి చేశాడు.
జూలై12న రాధిక, అనంత్ ల వివాహం జరగనుంది. దీనికి సంబంధించి మే చివరి వారంలో పెళ్ళి పనులు మొదలవుతాయని అంబానీ కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు పెళ్ళివేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన అంబానీ కుటుంబం..ఈవేడుకలను అంతకుమించి అనే స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈవేడుకల కోసం భారీగా ఖర్చు పెట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిధుల కోసం ప్రత్యేకంగా లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది.