YS Sharmila: వైఎస్ షర్మిల నేడు ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణలో పార్టీ స్థాపించిన షర్మిల ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇటీవలే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దీంతో కాంగ్రెస్ హై కమాండ్ ఆమెను పిసిసి అధ్యక్షురాలిగా నియమించింది. దీంతో నిన్న ఆమె ఇడుపాలపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె వెంట కెవిపి రామచంద్ర రావు, రఘువీరారెడ్డి, తులసి రెడ్డి, సాకే శైలజనాథ్ ఉన్నారు.
పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకునే ముందు తండ్రి ఆశీస్సులు కోసం వచ్చానని షర్మిల చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాలు గురించి వెల్లడించారు. తన తండ్రి ఆశయాలను సాధించాల్సి ఉందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను రాజశేఖర్ రెడ్డి ప్రాణ సమానంగా భావించేవారు అని.. వాటిని తిరిగి నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు షర్మిల వెంట నడవడం విశేషం. కెవిపి రామచంద్రరావు వైఎస్ కు అత్యంత సన్నిహితుడు. రఘువీరారెడ్డి రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో కీలక మంత్రిగా వ్యవహరించారు. ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు షర్మిల వెంట కనిపిస్తున్నారు. హైదరాబాదు నుంచి కడపకు ప్రత్యేక విమానంలో షర్మిల రాగా.. ఆమె వెంట ఇద్దరు ఉన్నారు. దీంతో షర్మిల వెంట ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి తో పనిచేసిన నాయకులు నడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేడు పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. వీరిని చాలామంది అనుసరించనున్నట్టు తెలుస్తోంది.