YS Sharmila: కడపలో సీన్ మారనుంది. షర్మిల ఎంట్రీ తో పరిణామాలు శరవేగంగా మారనున్నాయి. నిన్నటి వరకు కడప అంటే వైఎస్ కుటుంబం.. వైఎస్ కుటుంబం అంటేనే కడప అన్న రీతిలో ఉండేది పరిస్థితి. కానీ క్రమేపి పరిస్థితి మారింది. వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆ కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది. అటు విజయమ్మ, షర్మిల సైతం జగన్ కు దూరమయ్యారు. షర్మిల తన తండ్రి పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు తీసుకోనున్నారు. దీంతో సొంత గడ్డపై తన ఉనికి చాటుకోవాలని బలంగా భావిస్తున్నారు. కడప జిల్లాలో పట్టు సాధించి కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసేందుకు ప్రయత్నించనున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే షర్మిలకు ఇది క్లిష్ట సమయం. ఎన్నికలకు పట్టుమని రెండు నెలల వ్యవధి కూడా లేదు. తనను తాను నిరూపించుకునేందుకు ఉన్నది తక్కువ సమయమే. ఇప్పటికే రాజకీయంగా ఎదురు దెబ్బలు తగలడంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా సోదరుడు జగన్ పై పోరాటం చేస్తేనే ఆమెకు రాజకీయ భవిష్యత్తు దక్కేది. అందుకే ఆమె మొహమాటలు పెట్టుకునే పరిస్థితి ఉండదని తెలుస్తోంది. వైసీపీ సర్కార్ వైఫల్యాలపై ఆమె విరుచుకుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రెండు నెలల్లో కాంగ్రెస్ పుంజుకునే విధానం పైనే షర్మిల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.అందుకే ఆమె కడప జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీకి సైతం షర్మిల సిద్ధపడుతున్నట్లు సమాచారం. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి కానీ.. కడప పార్లమెంట్ స్థానం నుంచి కానీ షర్మిల బరిలో దిగే అవకాశం ఉంది. షర్మిల వెంట వివేకానంద కుమార్తె సునీత నడిచే అవకాశం ఉంది. వివేకా హత్యపై సునీత గట్టిగానే పోరాడుతున్నారు. ఆమెకు షర్మిల అన్ని విధాలా అండగా నిలబడ్డారు.తండ్రి హత్య పై పోరాడే క్రమంలో రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు షర్మిల రూపంలో ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. అందుకే ఒకటి రెండు రోజుల్లో సునీత సైతం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సునీత చేరితే ఆమెను కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. షర్మిల సైతం పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే కుటుంబం మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది.
వైఎస్ కుటుంబం పై కడప జిల్లాలో విపరీతమైన ప్రజాభిమానం ఉంది.కానీ వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆ అభిమానం లో చీలిక వచ్చింది. అటు కుటుంబం కూడా అడ్డగోలుగా చీలిపోయింది. కానీ కుటుంబంలో మెజారిటీ సభ్యులు మాత్రం షర్మిల, సునీతలకు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఆ కుటుంబం మధ్య నలుగుతున్న రాజకీయ వివాదం విషయంలో విపక్షాలు సైతం జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఒకవేళ సునీత కడప పార్లమెంట్ స్థానానికి, షర్మిల పులివెందుల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే విపక్షాలన్నీ మద్దతు తెలిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే సొంత గడ్డలో జగన్ ఆధిపత్యానికి గండి తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.