YS Jagan Mohan Reddy : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy) కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన కొద్ది రోజుల కిందటే బెంగళూరు చేరుకున్నారు. ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లి కి వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు పార్టీ ముఖ్యులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. విజయసాయి రెడ్డి రాజీనామా, భవిష్యత్ కార్యాచరణ, జిల్లాల టూర్లకు సంబంధించి వారితో అభిప్రాయాలను పంచుకోనున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ ఏయే మార్పులు చేయాలి? అనే దానిపై చర్చించనున్నారు. అదే సమయంలో కొన్ని దూకుడు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పార్టీ పరంగా కూడా కొన్ని రకాల నిర్ణయాలు ఉంటాయని సమాచారం.
* సంక్లిష్ట పరిస్థితుల్లో వైసిపి
వైసిపి( YSR Congress) సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మరికొందరు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డికి చెప్పి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ తరుణంలో విజయసాయిరెడ్డి రాజీనామా పై పార్టీ నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు జగన్మోహన్ రెడ్డి. పైగా పార్టీలో తనతో ఉండి పోరాడిన వారితోనే రాజకీయం చేస్తానని జగన్ భావిస్తున్నారు. అదే విషయాన్ని పార్టీ నేతలకు చెప్పనున్నారు. ముఖ్యంగా ఈ ఐదేళ్లపాటు పరిస్థితి ఇలానే ఉంటుందని.. తట్టుకొని నిలబడిన వారికి తగిన ప్రాధాన్యం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు చెప్పే అవకాశం ఉంది.
* వైసీపీ నిర్వీర్యానికి ప్లాన్
వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్నది కూటమి పార్టీల ప్లాన్. ప్రధానంగా చంద్రబాబు( Chandrababu) ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టరని.. కేంద్రంలోని బిజెపి ద్వారా వైసీపీని పూర్తిగా కంట్రోల్ చేస్తారని జగన్ ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. పార్టీ కీలక నేతలను కేసులతో వెంటాడుతారని.. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో.. అన్ని రకాలుగా పెడతారని.. కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. పార్టీ నుంచి ఎంత కీలకమైన నేతలు బయటకు పోయినా.. తాను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని.. కాంగ్రెస్ పార్టీ నుంచి తన తల్లితోపాటు తానే బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఈరోజు పార్టీ ముఖ్యుల సమావేశంలో సైతం కొన్ని అంశాలపై ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారు. ధైర్యంగా తనతో ఉన్న వారితోనే రాజకీయం చేస్తానని పార్టీ నేతలతో చెప్పే అవకాశం ఉంది.
* మిగతా నేతలపై అదే ఒత్తిడి విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వెనుక చాలా రకాల ఒత్తిళ్ళు ఉన్నాయి. అయితే అది ఆయన ఒక్కడితోనే ఆగదని.. జగన్ చుట్టూ ఉన్న కీలక నేతలను అదేవిధంగా భయపడతారని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి కుమారుడి పేరును కాకినాడ పోర్టు వాటాల బదిలీల విషయంలో తెరపైకి తెచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై అటవీ భూముల ఆక్రమణ అంటూ కొత్త అభియోగాలు మోపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం టార్గెట్ చేసుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డిని సైతం వెంటాడుతున్నారు. అయితే ఇది ఆ నలుగురు ఐదుగురు నేతలతో ఆగదు. వైసీపీలో ఉన్న ప్రతి నేతను వెంటాడుతారు. అదే విషయం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు గుర్తు చేస్తున్నారు. ధైర్యంగా కేసులను ఎదుర్కొందాం. ప్రజాక్షేత్రంలో నిలబడుదాం అంటూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిలబడే వారి తన వెంట నడవాలని.. లేకున్నవారు తమ ఇష్ట ప్రకారం నడుచుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెబుతున్నారట. మొత్తానికైతే కూటమి ప్రభుత్వంతో యుద్ధానికి జగన్ సిద్ధపడ్డారు అన్నమాట.