YS Jagan Padayatra: ఏదైనా ఒక రాజకీయ పార్టీకి వ్యూహం ఉండాలి. ఒక ప్రణాళిక ఉండాలి. పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన గందరగోళం ఏర్పడితే అంతిమంగా నష్టం చేకూరుస్తుంది. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి అదే పరిస్థితి ఎదురయింది. ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇటువంటి తరుణంలో మళ్లీ ప్రజల్లోకి వచ్చి వారి విశ్వాసాన్ని చూరగొనాలి. ఐదేళ్లపాటు అధికార పక్షానికి అవకాశం ఇవ్వాలి. సొంత పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలి. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇది ఎంత మాత్రం కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి బలప్రదర్శనకు మాత్రమే పరిమితం అవుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రత్యేక పరిస్థితుల్లో వైసిపి ఏర్పాటు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడింది. రాజశేఖర్ రెడ్డి ( Y S Rajasekhara Reddy )అకాల మరణంతో సానుభూతిని క్యాచ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆకర్షించి ఏర్పడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. విపరీతమైన సానుభూతితో పాటు వ్యక్తిగత నామస్మరణతో.. వ్యక్తిని అభిమానిస్తూ ఏర్పాటు అయ్యింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి విపరీతమైన ఆదరణ ప్రజల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా జనాలు వస్తారు. జననీరాజనాలు పడతారు. అంతమాత్రాన అదే విజయం తెచ్చి పెడుతుందని ఆశించడం ఎంత మాత్రం తగదు. మొన్నటి ఎన్నికలే అందుకు ఉదాహరణ.
Also Read: జగన్ ఓడిపోతారని నేను ఊహించలేదు.. కేటీఆర్ కామెంట్స్ వైరల్!
వైసీపీ శ్రేణుల్లో ఆ ధీమా
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జమిలి ఎన్నికలు( Jamali elections ) వస్తాయని ఎక్కువగా భావిస్తున్నారు. 2027లో ఎన్నికలు వస్తాయని.. గెలుపు తమదే నన్న ధీమాతో ఉన్నారు. అయితే దీనిపై తప్పుడు సంకేతాలను పార్టీ శ్రేణులకు ఇస్తున్నారు. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి నేతలు జమిలిపై భిన్న ప్రకటనలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ముందస్తు ఎన్నికలు వస్తే ఆయన ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లేవారు. అయితే పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అది అసలుకే ఎసరు వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2028 వరకు జగన్ రెస్ట్..
2028లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉంటుందని వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అటువంటిప్పుడు 2027లో జమిలి ఎన్నికలు ఎలా వస్తాయని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 2028లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తారని.. అంతవరకు రెస్ట్ తీసుకుంటారని.. వారాంతపులో మాత్రమే వచ్చి సమావేశాలు పెడతారని పేర్ని నాని లాంటి నేతలు అంతర్గతంగా చెబుతున్నారట. అయితే పార్టీ అంటే ప్రజల్లోకి వెళ్లాలి. పార్టీ విధానాలను చాటి చెప్పాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. క్షేత్రస్థాయిలో ఈ విషయాలన్నింటినీ మరిచిపోతుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కేవలం ఎన్నికలు అనే అంశం చుట్టూ తిరుగుతోంది. ఓటమి నేర్పిన గుణపాఠాల నుంచి బయటపడే ప్రయత్నం చేయడం లేదు. ఇది ముమ్మాటికి ఆ పార్టీకి మైనస్.