Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan : మీ సేవలు చాలు.. మాజీ మంత్రికి తేల్చి చెప్పిన జగన్!

YS Jagan : మీ సేవలు చాలు.. మాజీ మంత్రికి తేల్చి చెప్పిన జగన్!

YS Jagan : ఏపీలో( Andhra Pradesh) సీనియర్ మోస్ట్ లీడర్ ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao ). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం ఆయన ప్రభావం చూపారు. సుదీర్ఘకాలం మంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కానీ యాక్టివ్ గా లేరు. ఆ పార్టీలో ఉంటారో? ఉండరో? తెలియని పరిస్థితి. పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కాదు కాదు అలాంటి పరిస్థితి లేదని ఆయన అనుచర వర్గం చెబుతూ వచ్చింది. అయితే ఇప్పుడు అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం ధర్మాన ప్రసాదరావును పట్టించుకోవడం మానేశారు. ఉంటే ఉండండి.. లేకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోండి అని జగన్మోహన్ రెడ్డి నుంచి వర్తమానం వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే ధర్మాన నుంచి మౌనం సమాధానం ఎదురు కావడంతో.. శ్రీకాకుళంలో ఆయన స్థానంలో ప్రత్యామ్నాయ నాయకుడి కోసం అన్వేషిస్తున్నారట జగన్మోహన్ రెడ్డి.

Also Read : వైసీపీని యాక్టివ్ చేసే పనిలో జగన్.. ఏకంగా 30 మందితో జంబో కమిటీ!

* దారుణ ఓటమితో
2024 ఎన్నికల్లో ఓడిపోయారు ధర్మాన ప్రసాదరావు. మంత్రిగా ఉంటూ ఓ సామాన్య సర్పంచ్ చేతిలో ఓటమి చవిచూశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. కానీ ధర్మాన ప్రసాదరావు మాత్రం ఏకంగా 52,000 ఓట్ల తేడాతో ఓడిపోవడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లా కేంద్రం కావడం, ఆపై ఉద్యోగ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండడం, తీర ప్రాంతాల్లో టిడిపికి పట్టు ఉండడంతో ధర్మాన ప్రసాదరావు ఆలోచన మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే తన కుమారుడికి రాజకీయ భవిత ఉండదని ఆయన ఆందోళన చెందుతున్నారు. అలాగని కూటమి పార్టీలో ఆయనకు అవకాశం లేకుండా పోయింది. అందుకే మౌనాన్ని ఆశ్రయించారు. ఇంటి గుమ్మం కూడా దాటడం లేదు. అయితే పార్టీ అధినేతగా చాలాసార్లు ధర్మాన ప్రసాదరావుకు సమాచారం ఇచ్చారు. కానీ ఆయన నుంచి చలనం లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి సైతం వేరే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

* ధర్మానకు నో ఛాన్స్..
తాజాగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీని( political Advisory Committee ) ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. దాదాపు ఓ 30 మందిని ఆ కమిటీలో నియమించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ధర్మాన ప్రసాదరావు పేరు అందులో లేదు. దాదాపు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారితోపాటు సీనియర్ నేతలకు చోటు ఇచ్చారు. కానీ ధర్మాన ప్రసాదరావును మాత్రం నియమించలేదు. దీంతో ఆయనను జగన్మోహన్ రెడ్డి వదులుకున్నట్లేనని తేలిపోయింది. అయితే ధర్మాన చర్యలతో విసిగి వేసారి పోయిన జగన్మోహన్ రెడ్డి ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓసారి ధర్మాన ప్రసాదరావుకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక సూచన వెళ్లినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో మీరైనా యాక్టివ్ అవ్వండి. లేకుంటే కొత్త సమన్వయకర్త పేరును సూచించండి అని అడిగినట్లు సమాచారం.

* తమ్మినేని కి అవకాశం
గత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తమ్మినేని సీతారాం( Sitaram). ఆయనకు సైతం పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చోటు ఇచ్చారు. ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జిగా తమ్మినేని సీతారామును తప్పించారు. ఆయన స్థానంలో చింతాడ రవికుమార్ అనే ద్వితీయ శ్రేణి నేతకు బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి పార్టీలో అంటి ముట్టనట్టుగా ఉన్నారు తమ్మినేని సీతారాం. అయినా సరే ఆయనకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో నియమించారు. కానీ ధర్మాన ప్రసాదరావు పేరును కనీసం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ధర్మాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడడం ఖాయమని తేలిపోయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం ఆయన వదులుకోవడమే మంచిది అన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Also Read : రాజకీయాలకు రోజా గుడ్ బై!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version