RK Roja: మాజీ మంత్రి ఆర్కే రోజా( RK Roja ) రాజకీయాలకు స్వస్తి పలకనున్నారా? తిరిగి ఎంటర్టైన్మెంట్ రంగంలో అడుగుపెట్టనున్నారా? పొలిటికల్ కెరీర్ కు స్వస్తి చెపుతారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా రోజా రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. రాజకీయ విమర్శలు కూడా చేయడం లేదు. కూటమిపై ఆరోపణలు కూడా తగ్గించారు. మరోవైపు రాయలసీమ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా రాజీ చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు ఆమె బుల్లితెరలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. క్రమేపి ఆమె రాజకీయాలకు దూరం అవుతారని టాక్ అయితే మాత్రం వినిపిస్తోంది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు రోజా. కానీ కొద్ది నెలల కిందట వరకు యాక్టివ్ గా ఉన్నా ఆమె.. ఇప్పుడు ఉన్నపలంగా బుల్లితెరపై కనిపిస్తుండడంతో అందరిలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: ఆక్వాకు ఏపీ ప్రభుత్వం ఊపిరి!
* తనకంటూ ప్రత్యేక గుర్తింపు..
చిత్ర పరిశ్రమలో( cine industry) తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారు రోజా. తెలుగుతోపాటు తమిళంలోని ప్రముఖ హీరోలు అందరితోనూ నటించారు. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మెరిశారు. జబర్దస్త్ టీవీ షోలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్లపాటు కొనసాగారు. బుల్లితెరలో జబర్దస్త్ ఒక వెలుగు వెలిగింది. సూపర్ హిట్ గా నిలిచింది. అయితే అనూహ్యంగా ఆమె వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అప్పటినుంచి టీవీ షోలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మరోసారి బుల్లితెరలో కనిపిస్తుండడంతో రాజకీయాలకు దూరమయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో కొత్త సీజన్ ప్రారంభం అయింది. ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఈ షోకు యాంకర్ గా ఉన్నారు. రోజాతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
* అనుమానాలకు కారణాలు అవే..
అయితే చాలా రోజులకు ఆమె బుల్లితెరలోకి వస్తుండడంతో రకరకాలైన అనుమానాలు ప్రారంభం అయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఓడిపోయిన తర్వాత ఆమె కొద్ది రోజులపాటు సైలెంట్ అయ్యారు. ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ కాలం గడిపారు. అయితే మధ్యలో వైసీపీ అధికార ప్రతినిధుల జాబితాలో ఆర్కే రోజాకు చోటు దక్కింది. అప్పటినుంచి పార్టీ వాయిస్ బలంగానే వినిపిస్తున్నారు. కానీ ఇటీవల ఆమె మంత్రిగా ఉండేటప్పుడు జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. దానిపై కూటమి అంతర్గతంగా విచారణ చేపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే ఆమె సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. ఓ మంత్రి తో రాజీ ఫార్ములాను అనుసరించినట్లు తెలుస్తోంది.
* తెలుగుదేశం ద్వారా పొలిటికల్ ఎంట్రీ..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆర్కే రోజా. రెండుసార్లు ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ ఓటమి తప్పలేదు. 2014లో తొలిసారిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి నగిరి నుంచి గెలిచారు. 2019లో రెండోసారి గెలవడంతో ఆమెకు మంత్రి పదవి దక్కింది. అయితే ఆమె దూకుడు కొంత ప్రతికూల పరిస్థితులను తీసుకొచ్చింది. 2024 ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓడిపోయారు. అయితే పొలిటికల్ గా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారట రోజా. అందుకే మళ్ళీ సినిమాలతో పాటు బుల్లితెర వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే కొత్త కార్యక్రమాల్లో రోజా కనిపిస్తున్నారు. క్రమేపి ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటారని కూడా ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.