YS Jagan (1)
YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఆనంద్ రెడ్డి (ఈయన వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు) సతీమణి సుశీలమ్మ (85) బుధవారం పులివెందులలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కుటుంబ సభ్యులు కార్పొరేట్ ఆసుపత్రులలో చూపించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఆ మధ్య సుశీలమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లారు. సుశీలమ్మను పరామర్శించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అంది.. ఆమె త్వరగా కోలుకునే విధంగా చేయాలని సూచించారు. వయోభారం.. ఇతర అనారోగ్య సమస్యలు ఆమెను చుట్టుముట్టడంతో వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను పులివెందుల తీసుకొచ్చారు. కొంతకాలంగా సుశీలమ్మ పులివెందులలోనే ఉంటున్నారు. అయితే ఆమె ఆరోగ్యం అంతకంతకు క్షీణించడంతో మంచానికే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా నర్సులను నియమించి ఆమెకు సపర్యలు చేయిస్తున్నారు. ఊపిరి సలపని పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి సుశీలమ్మ ఆరోగ్యం గురించి వాకబు చేసేవారు. అయితే బుధవారం ఆరోగ్య పరిస్థితి విషమించి సుశీలమ్మ కన్నుమూశారు.. ఈ విషయం తెలియడంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు పులివెందుల వెళ్తారని తెలుస్తోంది.
Also Read: జగన్ జిల్లాల పర్యటన ఎప్పుడు? ఉగాది తర్వాత లేనట్టేనా?
రెండు నెలల కింద పరామర్శ
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ఓటమి పాలైంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ.. 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైంది. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పై పోరాడుతూనే ఉన్నారు. నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూనే ఉన్నారు. రెండు నెలల క్రితం సుశీలమ్మను జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆనంద్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా జగన్ పరామర్శించారు. జగన్ పరామర్శకు వెళ్ళినప్పుడు సుశీలమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు.. ఇక సుశీలమ్మ చనిపోయిన నేపథ్యంలో వైఎస్ కుటుంబ సభ్యులు పులివెందులకు చేరుకుంటున్నారు.. గురువారం సుశీలమ్మ అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారని సమాచారం. వైయస్ కుటుంబం క్రైస్తవ మతాన్ని ఆచరిస్తోంది. సుశీలమ్మ అంత్యక్రియలు కూడా క్రైస్తవ మత పద్ధతిలోనే జరుగుతాయి.. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఆయన అంత్యక్రియలను క్రైస్తవ మత పద్ధతిలోనే జరిపించారు. వైయస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలను కూడా క్రైస్తవ మత పద్ధతిలోనే నిర్వహించారు.. సుశీలమ్మ అంత్యక్రియల నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం దాకా జగన్మోహన్ రెడ్డి పులివెందులలోనే ఉంటారని.. ఆ తర్వాత ఆయన బెంగళూరు వెళ్తారని తెలుస్తోంది.