YCP : జగన్ వైసీపీ కొంప కూల్చడానికే ఈ పనిచేస్తున్నాడా? అతడి నియామకంపై పార్టీలో వ్యతిరేకత

వైసిపి అధికారంలో ఉన్న రోజులు ఆ నలుగురే అన్ని చేశారు. చివరకు సీఎంవో ను సైతం వారే నడిపారు. వారి తీరుతోనే వైసీపీకి ఓటమి అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే వ్యక్తులకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడం విస్మయం వ్యక్తం అవుతోంది. అసలు జగన్ తెలిసే చేస్తున్నారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Written By: Dharma, Updated On : August 24, 2024 7:30 pm

YS Jagan entrusted Chevireddy Bhaskar Reddy

Follow us on

Ycp leader chevireddy bhaskarreddy : వైసీపీని పునర్వ్యవస్థీకరించాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కీలక స్థానాలకు సంబంధించి తన నమ్మకస్తులను నియమిస్తున్నారు. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. దీనిపై పార్టీలో విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఘోర పరాజయానికి ఒక వంతు భాస్కర్ రెడ్డి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ ఎన్నికలకు ముందు ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు జగన్. ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ లో ఆ నలుగురిలో స్థానం ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచనలతోనే చాలావరకు ముందుకు పోయారు జగన్. అభ్యర్థుల వడపోత కార్యక్రమం సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చూశారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులపై సర్వే నిర్వహించింది మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఒక విధంగా చెప్పాలంటే వైసిపి ఓటమికి ఆ నలుగురే కారణమని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 80 చోట్ల అభ్యర్థులను మార్చారు జగన్. ఈ మార్పు వెనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారన్నది వైసీపీలో వినిపిస్తున్న మాట. గతంలో తెలంగాణ ఎన్నికల్లో సైతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వేలు చేశారు. మళ్లీ కెసిఆర్ అధికారంలోకి వస్తారని తేల్చారు. కానీ అక్కడ కెసిఆర్ ఓడిపోయారు. అయినా సరే ఏపీలో సర్వే బాధ్యతలను అప్పగించారు జగన్. కానీ చెవిరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణ వైసీపీలో ఉంది. ముఖ్యంగా సీనియర్లలో గూడు కట్టుకుంది. పార్టీని నష్టపరిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెచ్చి రాష్ట్రస్థాయి పదవి ఇవ్వడం ఏంటి అన్న ప్రశ్న పార్టీలో వినిపిస్తోంది.

* చంద్రగిరికి ప్రాతినిధ్యం
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. కానీ ఆయన దూకుడు శైలితో నియోజకవర్గంలో అసంతృప్తిని మూటగట్టుకున్నారు. అన్ని సర్వేల్లో ఆయనకు వ్యతిరేకత రావడంతో చంద్రగిరిని విడిచిపెట్టారు చెవిరెడ్డి. తన బదులు కుమారుడిని తెరపైకి తెచ్చారు. జగన్ తో ముందుగా ఈ విషయాన్ని చెప్పారు. వారసులకు టిక్కెట్లు లేవని చెప్పిన జగన్.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే చంద్రగిరిలో చెవిరెడ్డి కుమారుడు.. పక్క జిల్లా ఒంగోలులో చెవిరెడ్డి.. ఇద్దరూ ఓడిపోయారు. అటు ఒంగోలులో చెవిరెడ్డి రాకతో సీన్ మారింది. వైసీపీకి నష్టం జరిగింది.

* పెత్తనాన్ని సహించని నేతలు
అయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు గడికోట శ్రీకాంత్ రెడ్డి కి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించారు జగన్. కేవలం రాయలసీమ నుంచి నేతలను తెప్పించి తమపై పెత్తనం చేయిస్తే సహించేది లేదని వైసీపీలో సీనియర్లు తెగేసి చెబుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు అప్ గ్రేడ్ చేయడం ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఆయన వల్లే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని.. అటువంటి వ్యక్తిని తీసుకువచ్చి మళ్ళీ పగ్గాలు అప్పగించడం ఏంటని నేతలు లోలోన రగిలిపోతున్నారు.

* అధినేత మెప్పుకోసం
వైసీపీకి ఓటమి ఎదురుకావడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ప్రధాన కారణం అన్న ఆరోపణ వైసీపీలో ఉంది. ఆయన ఒక పెద్ద యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని.. రాష్ట్రస్థాయిలో సర్వేలు చేసి.. అభ్యర్థుల మార్పు విషయంలో అధినేత జగన్ కు రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. కేవలం అధినేత మెప్పు కోసమే పార్టీని నష్టపరిచారని నేతలు ఆరోపిస్తున్నారు. ఆ నలుగురిలో ఒకరైన చెవిరెడ్డికి మరోసారి ప్రాధాన్యం ఇవ్వడం మాత్రం.. వైసీపీలో మింగుడు పడని విషయం. కష్టాల్లో ఉన్న పార్టీని మరింత కష్టాల్లో నెట్టేందుకు ఆయనకు పగ్గాలు ఇచ్చారని నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.