YS Jagan : వైసిపి అధినేత జగన్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తన జైత్రయాత్ర కొనసాగిస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో వైసిపి ఓడింది. కానీ గౌరవప్రదమైన సీట్లతో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. 2019లో అయితే ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్నికల్లో మాత్రం కనీసం ఉనికి చాటుకోలేకపోయింది. 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. దీంతో పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఆ నష్టం నుంచి ఎలా అధిగమించాలి అన్న దానిపై జగన్ పెద్ద ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో గతంలో వద్దనుకున్న నాయకులను ఇప్పుడు చేరదీయాల్సి వస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మిగిలిన ఆ కొద్దిపాటి నాయకులను వైసీపీలోకి రప్పించుకోవాలని చూస్తున్నారు జగన్. గతంలో అదే నాయకులు వైసీపీలోకి వస్తామంటే పెద్దగా ఆసక్తి చూపని జగన్.. ఇప్పుడు అవసరం కోసం వారిని చేరదీసే పనిలో పడ్డారు. చాలామంది నాయకులతో అప్రోచ్ అవుతున్నారు జగన్. కానీ ఐదేళ్ల కిందట అదే నాయకులు రాయభారం పంపినా స్పందించలేదు జగన్.
* అప్పుడే చేరాలనుకున్నా
అనంతపురం జిల్లాకు చెందిన శైలజానాథ్ వైసీపీలో చేరేందుకు అప్పట్లో ప్రయత్నం చేశారు. కానీ జగన్ నుంచి అంత ఆసక్తి కనిపించలేదు. కానీ అంతులేని విజయంతో ఉన్న జగన్ పెద్దగా ఆసక్తి చూపలేదు. పైగా సాకే శైలజానాథ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మనిషిగా ముద్రవేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో సాకే శైలజానాథ్ సభ్యుడిగా ఉండేవారు. బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళాక.. పీసీసీ పగ్గాలు అందుకున్నారు. అయితే ఆది నుంచి జగన్ విషయంలో వ్యతిరేక భావనతోనే ఉండేవారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ గెలిచేసరికి ఆ పార్టీలో చేరాలని భావించారు. కానీ జగన్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో భారీ ఓటమి ఎదురయ్యేసరికి శైలజానాథ్ అవసరం ఏర్పడింది. అందుకే ఇప్పుడు శైలజా నాథ్ తో వైసీపీ నేతలు జరిపిన చర్చలు ఫలప్రదం అయినట్లు సమాచారం. త్వరలో ఆయన వైసీపీలో చేరడం ఖాయంగా తెలుస్తోంది.
* ఎట్టకేలకు వైసీపీ గూటికి
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ నుంచి 2004లో పోటీ చేశారు శైలజానాథ్. ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. 2009లో రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.రాష్ట్ర విభజనతో పాటు వైసీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దాదాపు కాంగ్రెస్ పార్టీని వీడి చాలామంది నేతలు వైసిపి తో పాటు టిడిపిలో చేరారు. కానీ సాకే శైలజానాధ్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. పీసీసీ పగ్గాలు కూడా అందుకున్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ సమీకరణలు కలిసి రాలేదు. ఇప్పుడు వైసీపీకి అక్కడ నాయకత్వం అవసరం. అదే సమయంలో శైలజానాథ్ సైతం కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్ పిలవడంతో వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు.