Mp Avinash Reddy – CBI : ‘సీబీఐ అంటే ఏదో అల్లాటప్పా కాదు.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్. ఆఫీసు గల్లీలో కాదు ఢిల్లీలో ఉంటుంది. పిలిచిన వెంటనే రాకుంటే చెడ్డీలు పగిలిపోతాయి’ అప్పుడెప్పుడో నాయక్ సినిమాలో కమెడియన్ ఎంఎస్ సత్యనారాయణ పలికే డైలాగు ఇది. ఇప్పుడు ఆ డైలాగు యెదుకూరి సందింటి అలియాస్ వైఎస్ కుటుంబం వారికి గుర్తుచేస్తే కానీ వారు దారిలోకి వచ్చే చాన్స్ కనిపించడం లేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో అదే కుటుంబానికి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముప్పుతిప్పలు పెడుతున్నారు. విచారణకు పిలిస్తే అదిగో.. ఇదిగో అంటున్నారే తప్ప కార్యాలయానికి చేరుకోవడం లేదు.
సీబీఐ అంటే మరీ చౌక వస్తువులా మారిపోయింది యెలుగూరి సందింటి వారికి. తాను కేసులు ఎదుర్కొన్నప్పుడు సీబీఐ వెరీ వరస్ట్ విచారణ సంస్థ. కానీ తన బాబాయ్ చనిపోయినప్పుడు మాత్రం ప్రియంగా మారిపోయింది. రాష్ట్ర సీఐడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయదని చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక సీబీఐపై మోజు తీరిపోయింది. రాష్ట్ర పోలీస్, సీఐడీ ఉండగా సీబీఐ ఎందుకు అని ప్రశ్నించారు. తీరా సోదరి సునీతారెడ్డి సుప్రీం కోర్టు తలుపు తట్టేసరికి సీబీఐ విచారణకు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకున్నారు.. సరే.. సీబీఐ దర్యాప్తునకు సహకరిస్తున్నారంటే అదీ లేదు. కోర్టులకు వెళుతున్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలా ఎందుకు.. ఇలా విచారణ చేపట్టాలని వాదనలకు దిగుతున్నారు. సహ నిందితుడిగా సీబీఐ పేర్కొన్న అవినాష్ రెడ్డికి విచారణకు పిలిస్తే ఇదిగో వస్తున్నా అని ఇంటి నుంచి బయలుదేరుతారు. కానీ సీబీఐ ఆఫీసుకు చేరరు. మధ్యలో ఎక్కడికో వెళ్తారు. ఏదో ఓ కారణం చెబుతారు. మరోసారి అదే పని చేశారు.
ఏదైనా కేసు విచారణలో ఒకసారి.. రెండుసార్లు గడువు కోరుతారు. కానీ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి గడువులు మీద గడువులు కోరుతున్నారు. మొన్నటికి మొన్న నాలుగు రోజులు గడువు కోరిన ఆయన..శుక్రవారం విచారణకు వచ్చినట్టే వచ్చి యూటర్న్ తీసుకొని తిరిగి పులివెందుల వెళ్లిపోయారు. పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన ఉదయం పది గంటల సమయంలో సీబీఐ విచారణకు బయలుదేరారు. అయితే అదే సమయంలో ఆయనకు పులివెందుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన తల్లి అనారోగ్యంతో పులివెందుల ఆస్పత్రిలో చేరారన్న సమాచారం వచ్చింది. దీంతో ఆయన సీబీఐ విచారణకు రాలేనని.. తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పులివెందులకు వెళ్తున్నానని సీబీఐ అధికారులకు లేఖ రాసి .. హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు.
అయితే ఈ పరిణామంతో సీబీఐ అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది. ఆయన పులివెందుల వెళ్తున్నారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే అవినాష్ రెడ్డి రాసిన లేఖ విషయంలో సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించలేదు. అవినాష్ రెడ్డి తీరుపై సీబీఐ సీరియస్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అటు అవినాష్ రెడ్డి తీరు అలా ఉంటే.. అనుచరుల తీరు మరోలా ఉంది. ఆగారా? అంటే అదీ లేదు. మీడియా ప్రతినిధులు, వాహనాలపై దాడిచేశారు. అవినాష్ రెడ్డి రావడం లేదని విషయం తెలిసిన తర్వాత మీడియా కవరేజీ ఇస్తున్న ప్రతినిధులపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇది కూడా మైండ్ బ్లాక్ అయ్యే అంశమే.