YCP Party : వారితోనే వైసీపీకి నష్టం.. మౌనం కూడా వారిని ప్రోత్సహించినట్టే!

భావ ప్రకటన స్వేచ్ఛ. ఇటీవల బలంగా వినిపిస్తున్న మాట ఇది. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మాట్లాడుతూ ఈ నినాదాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పార్టీల అధినేతల పేరును వాడుకుంటూ పబ్బం గడుపుతున్నారు. కానీ వారు చేసే నష్టం అంతా ఇంతా కాదు.

Written By: Dharma, Updated On : November 7, 2024 1:03 pm

YCP Party

Follow us on

YCP Party :  మనం తప్పు చేయకపోయినా.. మన ఎదురుగా జరుగుతున్న తప్పును సరిదిద్దకపోతే కచ్చితంగా మనమే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మన పేరుతో ఇంకొకరు అరాచకాలకు పాల్పడితే దానిని నియంత్రించాలి. అటువంటి వారికి దూరంగా ఉండాలి. లేకుంటే మూల్యం తప్పదు. గత ఎన్నికల్లో వైసీపీకి ఎదురైంది అదే. సోషల్ మీడియా యాక్టివిస్టులు కొందరు అతిగా ప్రవర్తించారు. అంతకుమించి జగన్ పేరును ఎక్కువగా వాడుకున్నారు. దీంతో ప్రతికూల ప్రభావం ప్రజల్లోకి వెళ్ళింది. వారు చేసే తప్పిదాలు వైసీపీకి అంటగాకాయి. ఎన్నికల్లో నష్టం చేకూర్చాయి.తటస్థ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి అటువంటి వారి వ్యాఖ్యలు. వైసిపి హయాంలో కొన్ని అసాంఘిక శక్తులు జగన్ పేరు చెప్పుకున్నాయి. పబ్బం గడుపుకున్నాయి. వీళ్ళ వికృతి చేష్టలకు నాటి ప్రభుత్వ పెద్దల మౌనం ప్రోత్సాహం గా మారింది. నోటికి ఎంత వస్తే అంత మాటలు ఆడే వైసీపీ నేతలు ఒకవైపు… ప్రత్యర్థులను రంగులు అంటగట్టి.. ఆ ఇంట్లో మహిళలను కించపరిచే సోషల్ మీడియా యాక్టివిస్టులు మరోవైపు వైసీపీకి నష్టం చేకూర్చారు. మరోవైపు జోష్యాలు, జాతకాలు.. ఇలా ఒక్కటేమిటి అన్ని విధాలా వైసిపిని డ్యామేజ్ చేసిన వారు ఉన్నారు.
* తాజాగా కడపకు చెందిన ఓ వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ పోస్టులు చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అంత జుగుప్సాకరంగా ఉంటాయి ఆ పోస్టులు. ఆయన సోషల్ మీడియా యాక్టివిస్టే కాదు.. అధినేత కుటుంబానికి సహాయకుడు కూడా. అటువంటి వారు ఎంత హుందాగా ఉండాలి. ఈరోజు ఆయన అరెస్టు ద్వారా ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఆయన నీఛాతి నీచమైన భాష వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ వ్యక్తిని తప్పు పట్టడమే కాదు.. ఆయనను ప్రోత్సహించడం వెనుక అధినేత ఉన్నారన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. అంతిమంగా అది పార్టీకి నష్టం చేకూరుస్తోంది.
* వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు ఓ రౌడీ షీటర్. తనకు తాను న్యాయవాదిగా చెప్పుకుంటూ ఆయన చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. చంద్రబాబు, లోకేష్ లను క్షణాల్లో లేపేస్తానని.. తాను అభిమానించే నేత పర్మిషన్ ఇచ్చిన మరుక్షణం వారిని చంపేస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పవన్ తో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులను సైతం కించపరిచారు. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. రిమాండ్ ఖైదీగా మారారు.
* మరో మహిళ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ ప్రత్యర్ధులపై విరుచుకుపడే క్రమంలో తాను ఒక మహిళ అనిమరిచిపోయి వ్యవహరిస్తుంటారు. మధ్య మధ్యలో అసభ్య పదజాలాలను వాడుకొని ప్రత్యర్థులను కించపరుస్తుంటారు. అయితే వీరంతా జగన్ అన్న అంటూ వైసీపీ అధినేత పేరు వాడుతుంటారు. అయితే ఇది వినేందుకు వినసొంపుగా ఉన్నా.. ఇటువంటి వారి ద్వారా వచ్చే నష్టం అంతు పట్టదు. గత ఎన్నికల్లో వైసీపీకి ఎదురైంది ఇదే. ఇటువంటి వారితోనే ఆ పార్టీకి భారీ డామేజ్ జరిగింది. ఇకనైనా ఇటువంటి వారిని దూరం పెడితే చాలా మంచిది. లేకుంటే మాత్రం హుందా రాజకీయాలను భ్రష్టు పట్టించిన వారు అవుతారు అనడంలో ఎటువంటి తప్పు లేదు.