Varra Ravindra Reddy: వైసీపీ సోషల్ మీడియా క్రియాశీలక కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.కూటమి పార్టీల ముఖ్య నేతలు,వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన రవీందర్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయనకు సంబంధించి సోషల్ మీడియా పేజీలవారీగా కార్యకర్తలను గుర్తించి నోటీసులు ఇస్తున్నారు పోలీసులు. అదే సమయంలో రవీందర్ రెడ్డి పై కేసులో పరంపర కొనసాగుతోంది. రవీందర్ రెడ్డి వైసీపీ కీలక నేత కుటుంబ సహాయకుడిగా కూడా పనిచేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు కూడా. ఈ నేపథ్యంలో పులివెందులలో ఓ దళిత యువకుడు ఫిర్యాదు మేరకు రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. రవీందర్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా 45 మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. వారిని విచారించేందుకు సిద్ధపడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా బలం, బలగం గురించి రవీందర్ రెడ్డి విచారణలో పూర్తిస్థాయిలో బయటపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో వారందరిపై పోలీసులు గురి పెట్టారు. విచారణ చేపట్టనున్నారు. అవసరమైతే అరెస్టులకు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
* పార్టీ ఆవిర్భావం నుంచి
వైసిపి సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ గా 2012లో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టినట్లు విచారణలో రవీందర్ రెడ్డి వెల్లడించారు. 2019లో వైసిపి సోషల్ మీడియా రాష్ట్రస్థాయి బాధ్యతలను ఐ డ్రీమ్ ఛానల్ చైర్మన్ చిన్న వాసుదేవ రెడ్డి తీసుకున్నారని చెప్పారు. వీరి టీంలో 65 మంది సభ్యులుగా ఉండేవారని.. ప్రధానంగా 12 మంది కార్యకర్తలు దూకుడుగా వ్యవహరించే వారిని విచారణలో రవీందర్ రెడ్డి వెల్లడించినట్లు తెలుస్తోంది. 2022లో వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జిగా సజ్జల భార్గవ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారని.. ఆయన వచ్చిన తరువాత అసభ్యకర పోస్టులు పెరిగాయని చెప్పుకొచ్చారు రవీందర్ రెడ్డి. దీంతో వారందరికీ నోటీసులు ఇచ్చే పనిలో పడ్డారు పోలీసులు. విచారణకు హాజరుకావాలని సూచించే అవకాశం ఉంది.
* వారందరి పేర్లు వెల్లడి
మరోవైపు చాలామంది వ్యక్తిగతంగా యూట్యూబ్ ఛానళ్లు నడిపే వారిని.. అందులో చాలామంది టిడిపి అగ్రనేతలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని రవీందర్ రెడ్డి వారి పేర్లను సైతం వెల్లడించారు. ఇందులో కొందరు సినిమా నటీమణులు, మాజీ జర్నలిస్టులు, మీడియా ఛానల్స్ అధిపతులు కూడా ఉన్నారు. ఇప్పటికే కడప జిల్లాలో 26 మంది సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు 41 ఏ నోటీసులు అందజేశారు.విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని సూచించారు.