Andhra Pradesh Weather Alert: ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి. మరోవైపు పిడుగులతో కూడిన వానలు కూడా కొనసాగుతున్నాయి. ఒకవైపు నైరుతీ రుతుపవనాల రాక ఆలస్యం అవుతుండగా.. ఇంకోవైపు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో చల్లటి వాతావరణం కూడా ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో అయితే 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. అదే సమయంలో ఇంకొన్ని జిల్లాల్లో చిరుజల్లులతోపాటు ఉరుములతో కూడిన వాన పడుతోంది. ఈ పరిస్థితి ఈరోజు కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు భిన్న వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సరైన వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
* ఈరోజు ఎండల తీవ్రత..
ఈరోజు ఎండల తీవ్రత కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. 46 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 79 మండలాల్లో వేడి గాలులు కొనసాగుతాయని చెప్పింది. ఏలూరు, పోలవరం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ళ నుంచి బయటకు రావద్దని సూచిస్తోంది. అయితే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.
* ఈ జిల్లాల్లో వర్షాలు..
మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ. పిడుగులు పడతాయని కూడా హెచ్చరిస్తోంది. విద్యుత్ స్తంభాలు, చెట్లు కింద నిలబడకూడదని సూచిస్తోంది. బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడింది. ఈరోజు కూడా పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.
