Why AP Needs Jagan: మరోసారి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వై ఎ పి నీడ్స్ జగన్ పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు గురించి తెలియ చెప్పాలని ఏకంగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ఏడున్నర లక్షల మంది వైసీపీ సైన్యం ఎలాగూ ఉన్నారు. వారు ప్రస్తుతం నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నారు. మళ్లీ జగన్ సీఎం కావాల్సిన ఆవశ్యకత ఏంటో చెబుతున్నారు.. గత ప్రభుత్వం చేయలేనిది.. తమ ప్రభుత్వం చేస్తున్నది వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ టిడిపి, జనసేన కూటమి నుంచి ఆ ప్రయత్నం కనిపిస్తుందా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. కానీ రెండు పార్టీల మధ్య ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమైందని రెండు పార్టీల శ్రేణులు చెబుతున్నాయి. అయితే వైసీపీ స్థాయిలో ప్రజల మధ్యకు ఎందుకు రావడం లేదన్నది ఇప్పుడు ప్రశ్న. అధికారంలోకి రావాలన్న ఆత్రం సరే. దానికి సంబంధించిన కార్యాచరణ ఏది అన్న ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతోంది.
వైసీపీ ప్రభుత్వంలో అనేక వైఫల్యాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ఉపాధి అవకాశాల పెంపుతో ఆదాయం పెంచే కార్యక్రమాన్ని సంక్షేమ పథకాలతో మిళితం చేయలేకపోతోంది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఆశించిన స్థాయిలో ఊతమివ్వలేకపోయింది. దీంతో గ్రామీణ నిరుద్యోగం పెరిగి ప్రజలు అప్పులు ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వం ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని చెబుతుండగా.. గ్రామీణ మహిళలు దాదాపు 93% రుణగ్రస్తులుగా ఉన్నట్లు ఇటీవల ఓ సర్వే తేల్చడం విశేషం. సగటు ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న భారాలతో కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యవసరాలపై భారీగా పన్నులు పెరిగాయి. విద్యుత్, రవాణా చార్జీలు పెరిగాయి. ఈ వైఫల్యాలు అన్నింటిపై పోరాడే అవకాశమున్నా టిడిపి, జనసేనలు జారవిడుచుకుంటున్నాయి అన్న టాక్ ఉంది. కేవలం సభలు, రోడ్ షోల ప్రచారంతో సరిపెట్టడం తగదని.. క్షేత్రస్థాయిలో వైసీపీ సైన్యాన్ని ఢీకొట్టే విధంగా రెండు పార్టీల శ్రేణులను సమాయత్తం చేయాల్సిన అవసరం నాయకత్వాలపై ఉంది.
మరోవైపు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా భారీ ప్రచారానికి వైసీపీ తెరతీసింది. 24 రకాల బ్రోచర్లతో ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్రతి ఊరికో సచివాలయం, అందులో వివిధ శాఖల ఉద్యోగులను నియమించినట్లు చెబుతోంది. అర్హులందరికీ రాజకీయాలకతీతంగా నగదు బదిలీ పథకాలు, గ్రామానికి విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, పశువుల ఆసుపత్రి, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం.. ఇలా అన్నింటిపై సమగ్ర వివరాలు సేకరించి ఓ బ్రోచర్ని తయారు చేసింది. ఎందుకుగాను అక్షరాల 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అధికారులు గణాంకాలు చెబుతున్నాయి. అయితే వైసిపి చెబుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లో సైతం వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటిపై కూడా పోరాటం చేసి ప్రజల సానుభూతిని దక్కించుకునే అవకాశం టిడిపి, జనసేన కూటమి లకు ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 1.60 కోట్ల కుటుంబాలు ఉంటే.. అందులో 1.40 కోట్ల కుటుంబాలకు సంక్షేమ పథకాల లబ్ధి అందిందని సీఎం జగన్ అంచనా వేస్తున్నారు. అందుకే ఈ కుటుంబానికి ఎంత సంక్షేమం దక్కిందో గణాంకాలతో సహా వివరించాలని ఏకంగా యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం విశేషం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కేవలం ప్రచారానికి పరిమితం కాగా.. ఈసారి మాత్రం బ్రోచర్ తో గణాంకాలతో సహా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తాము మరోసారి అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని చెబుతున్నారు. లేకుంటే మాత్రం నిలిచిపోతాయని హెచ్చరికల సైతం చేసే అవకాశం ఉంది. అయితే నేరుగా ప్రజాప్రతినిధుల ద్వారా చెబితే అనుకున్న స్థాయిలో ప్రజలు స్పందించారని.. అర్థం చేసుకోలేరని.. అందుకే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా చెప్పే ప్రయత్నాలను జగన్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీకి భారీ సైన్యం ఉంది. అయితే ఆ స్థాయిలో తిప్పి కొట్టడంలో టిడిపి, జనసేన కూటమి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.