Chandrababu : వైసీపీ హయాంలో చాలా ఇబ్బందులు పడ్డారు చంద్రబాబు. ఏడుపదుల వయసులో 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు బెయిల్ దక్కకుండా.. కనీసం ఆధారాలు లేని కేసుల్లో జైల్లో ఉంచగలిగారు. ఈ విషయంలో వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారు. అయితే ఈ ఘటన ఎక్కువగా చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చింది. ఆయనకు సానుభూతినిచ్చింది. ఏపీలో కూటమి గూటికి ఆ మూడు పార్టీలు రావడానికి కారణమైంది. అయితే అప్పట్లో చంద్రబాబు విషయంలో అలా చేయవద్దని వైసీపీ నేతలు కూడా ఒకరిద్దరు అభిప్రాయపడ్డారు. కానీ అధినేతకు చెప్పలేకపోయారు.
* కేసులు వరకే…
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసిపి నేతలపై కేసులు నమోదవుతున్నాయి.కానీ అరెస్టులు మాత్రం జరగడం లేదు. ఒక్క సోషల్ మీడియా అరెస్టులు తప్ప.. పేరు మోసిన నేతల విషయంలో అస్సలు టచ్ చేయడం లేదు. ఈ విషయంలో టిడిపి తో పాటు కూటమి శ్రేణుల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది. వైసిపి కీలక నేతలను ఎందుకు విడిచి పెడుతున్నారు అన్న బాధ వ్యక్తం అవుతోంది. దానికి తాజాగా సమాధానం చెప్పారు వైసిపి మాజీమంత్రి పేర్ని నాని.చంద్రబాబు విధానాన్ని ఆయన పొగిడారు. ఆయన హుందాతనాన్ని బయటపెట్టారు. అయితే పేర్ని నాని లాంటి నేత చంద్రబాబు హుందాతనాన్ని బయట పెట్టడం అంటే..ఇది అభినందించాల్సిన విషయమే. టిడిపి శ్రేణులు ఆలోచించాల్సిన విషయమే.
* మంత్రి ఒత్తిడికి చంద్రబాబు నో
పేర్ని నాని కుటుంబం పై రేషన్ బియ్యానికి సంబంధించి కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ కుటుంబానికి చెందిన గోదాములను పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఈ క్రమంలో 7000 బస్తాలకు పైగా రేషన్ బియ్యం మాయం అయింది. దీంతో గోదాము మేనేజర్ తో పాటు పేర్ని నాని సతీమణి జయసుధ పై కేసు నమోదు చేశారు. దీంతో కొద్దిరోజుల పాటు పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం నడిచింది. అయితే ఈరోజు మీడియా ముందుకు వచ్చిన నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర తన భార్యను అరెస్టు చేసే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు నాని.కానీ ఈ విషయంలో చంద్రబాబు అడ్డుకున్నారని.. ఆడవారితో రాజకీయం ఏంటని ఆగ్రహించారని చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు హుందాతనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు పేర్ని నాని. అయితే చంద్రబాబు మెప్పుకోసం అలా అన్నారో.. లేకుంటే చంద్రబాబులో ఉన్న ఆ గుణాన్ని గుర్తించి అలా అన్నారో అన్నది పేర్ని నానికే తెలియాలి.