Telangana BJP : తెలంగాణలో బీజేపీ అంటే ఒకప్పుడు కేవలం ఇద్దరు, ముగ్గురు నేతల పేర్లు మాత్రమే వినిపించేవి. ఎప్పుడో ఎన్నికలప్పుడే ఆ పార్టీ సభలు, సమావేశాలు కనిపించేవి. అది కూడా మమ అన్నట్లుగా సాగేది. అయితే అధిష్ఠానం అనూహ్యంగా కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ను పార్టీ చీఫ్ గా నియమించింది. తొలుత కొంత మంది సీనియర్లు అసంతృప్తి రాగమెత్తినా పార్టీ జాతీయ కమిటీ మాత్రం బండి కే భరోసాగా నిలిచింది.
*అధ్యకుడిగా సంజయ్ ప్రస్థానం..
మార్చి11, 2020 న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నిమితుడైన సంజయ్ జులై 4,2023 వరకు కొనసాగారు. ఈ మూడేళ్ల ప్రస్థానంలో బండి తనదైన మార్కు చూపారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక భూమిక పోషించారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక, హుజురాబాద్ లో రఘునందన్, ఈటల రాజేందర్ ను గెలిపించడంలో తన సత్తా చాటారు. ఇక ఎన్నికలకు సన్నద్దమయ్యే క్రమంలో చేపట్టిన పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ప్రత్యర్థులపై సూటిగా నిప్పులు చెరిగే ఆయన మాటలు క్షేత్రస్థాయిలో ప్రతిధ్వనించాయి. రానున్న ఎన్నికలొస్తే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారింది అప్పటి పరిస్థితి. ఇలా పార్టీ ఊపుమీదున్న క్రమంలో ఏమైందో ఏమో కానీ అధిష్ఠానం అధ్యక్షుడిని మార్చింది. కిషన్ రెడ్డిని ఆ స్థానంలో కి తీసుకు వచ్చింది. ఒక్కసారిగా శ్రేణుల్లో ఆశ్చర్యం. అయితే పార్టీ అధ్యక్ష పదవికి నియమిత సమయం ఉంటుందని కేంద్ర పెద్దలు సర్దిచెప్పినా ఆ ప్రభావం ఎన్నికలపై చూపిందని కాషాయ దళం గుసగుసలు బహిరంగంగానే వినిపించాయి.
*కిషన్ రెడ్డి రాకతో..*
కిషన్ రెడ్డి మృదు స్వభావి. ప్రత్యర్థులపై చేసే విమర్శలు కూడా అదే స్థాయిలో ఉండేవి. ఈయన వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సత్తా చూపినా ఆశించిన ఫలితాలు రాలేదని కమలం పార్టీ పెద్దలే పేర్కొనడం గమనార్హం. ఇక లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మోడీ హవాలో భాగంగానే మెజార్టీ సీట్లు దక్కాయని ఆ పార్టీ శ్రేణులే అనుకోవడం వినిపించింది. మరోవైపు అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాత కొంత కాలం బండి సైలెన్స్ అయ్యారు. ఈ క్రమంలో అధిష్ఠానం ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి మంచి ఫలితాలు సాధించాలంటే మాస్ లీడర్ తోనే సాధ్యమని అంటోంది క్యాడర్.