Dharmana Prasad Rao: ఎట్టకేలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao ) మౌనం వీడారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయినట్లు సంకేతాలు పంపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ధర్మాన ప్రసాదరావు పెద్దగా కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. దీంతో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ లో ఉన్నారా? లేదా? అన్న అనుమానం కూడా కలిగింది. ఒకానొక దశలో ఆయన తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని కూడా ప్రచారం నడిచింది. ముఖ్యంగా జనసేనలో చేరుతారని టాక్ నడిచింది. కానీ 15 నెలలు అవుతున్న ఆయన రాజకీయ నిర్ణయంలో ఎటువంటి సంచలనాలు నమోదు కాలేదు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు ధర్మాన ప్రసాదరావు. ఈ తరుణంలో ఆయన మౌనం వీడారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. దీంతో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని స్పష్టమైంది.
Also Read: ‘లిటిల్ హార్ట్స్ ‘ మూవీ డైరెక్టర్ వాళ్ల తాత కూడా దర్శకుడనే విషయం మీకు తెలుసా..?
* సీనియర్ మోస్ట్ లీడర్..
ఉమ్మడి ఏపీ లోనే సీనియర్ మోస్ట్ లీడర్ ధర్మాన ప్రసాదరావు. కాంగ్రెస్ పార్టీలో( Congress Party) సుదీర్ఘకాలం సేవలందించారు. యువజన కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. తొలుత సర్పంచ్ గా, తరువాత ఎంపీపీగా, అటు తరువాత ఎమ్మెల్యేగా గెలిచి సుదీర్ఘకాలం మంత్రిగా కూడా వ్యవహరించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన ప్రధాన అనుచరుడిగా వ్యవహరించారు. 2004 నుంచి 2014 వరకు సుదీర్ఘకాలం మంత్రిగా ఉండేవారు. తండ్రి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీని వీడారు జగన్ మోహన్ రెడ్డి. ఆ సమయంలో జగన్ వైఖరిని వ్యతిరేకించారు ధర్మాన ప్రసాదరావు. ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. దీంతో జగన్మోహన్ రెడ్డి గత్యంతరం లేని స్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
* వైసీపీలోకి ఎంట్రీ..
2014 ఎన్నికల కు ముందు వైసీపీలో( YSR Congress) చేరారు ధర్మాన ప్రసాదరావు. అప్పటికే ఆయన సోదరుడు కృష్ణదాస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ వచ్చారు. అప్పటివరకు జగన్ వైఖరిని వ్యతిరేకించిన ధర్మాన ప్రసాదరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆ ప్రభావం 2014 ఎన్నికల్లో పడింది. ధర్మాన సోదరులు ఇద్దరూ ఓడిపోయారు. అయితే ధర్మాన తన శక్తి యుక్తులను ఉపయోగించి 2019లో శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి ఖాయమని అంచనా వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణ దాస్ కు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. విస్తరణలో చోటిచ్చేసరికి మళ్ళీ యాక్టివ్ అయ్యారు ధర్మాన ప్రసాదరావు.
* దారుణ ఓటమితో..
2024 ఎన్నికల్లో తన రాజకీయ జీవితంలో ఎదురుకాని ఓటమి ధర్మాన ప్రసాదరావుకు ఎదురయ్యింది. టిడిపి అభ్యర్థిగా ఓ సామాన్య సర్పంచ్ బరిలో దిగగా.. 52 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ధర్మాన ప్రసాదరావు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తనకు భవిష్యత్తు ఉండదని భావించారు. తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే జనసేనలో చేరడం ఉత్తమం అని భావించారు. ఒకానొక దశలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని.. రాజ్యసభ పదవి ఆఫర్ వచ్చిందని ప్రచారం నడిచింది. అయితే కూటమి పార్టీల నుంచి సానుకూలత లేకపోవడంతో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు దాదాపు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా కూటమి ప్రభుత్వంపై ధర్మాన విమర్శలు చూస్తుంటే ఆయన వైసీపీలో యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. మరి చూడాలి ధర్మాన వ్యవహార శైలి మున్ముందు ఎలా ఉండబోతుందో..