Homeఆంధ్రప్రదేశ్‌YCP MLCs: వైసీపీ ఎమ్మెల్సీలు టిడిపిలోకి.. నిజం ఎంత?

YCP MLCs: వైసీపీ ఎమ్మెల్సీలు టిడిపిలోకి.. నిజం ఎంత?

YCP MLCs: టిడిపిలో చేరడానికి వైసీపీ ఎమ్మెల్సీలు సిద్ధపడుతున్నారా?ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారా? తెలుగుదేశంలో చేరడం శ్రేయస్కరమని భావిస్తున్నారా? వైసీపీ పై తీవ్ర నిర్వేదంతో ఉన్నారా? మండలి డిప్యూటీ చైర్ పర్సన్ కూడా ఈ జాబితాలో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యింది.ఈ తరుణంలో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అలజడి నెలకొంది. పార్టీ ఇప్పుడే కోలుకునే పరిస్థితిలో లేదని స్పష్టమైంది. ఇటువంటి తరుణంలో నేతలు పక్క చూపులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీలు పార్టీ మారుతారన్న టాక్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ సైతం ఇదే విషయంపై పావులు కలపడంతో హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం పాలయింది. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన ఆ పార్టీ.. దేశం తన వైపు చూసుకునేలా చేసింది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి 11 స్థానాలకే పరిమితం అయ్యింది. ఇప్పుడు కూడా దేశం తన వైపు చూసుకునేలా చేసింది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కుతుందని జగన్ భావించారు.కానీ కర్ర కాల్చి వాత పెట్టారు ఏపీ ప్రజలు. అందుకే రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీలపై ఆశలు పెట్టుకున్నారు జగన్. రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో బిజెపికి ఆశించినంత బలం కూడా లేదు. ఇప్పుడు వైసీపీ కీలకంగా ఉంది. మరో ఆరు నెలల్లో బిజెపికి సంపూర్ణ బలం వస్తుంది. ఏపీ నుంచి టిడిపి ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది. మరోవైపు ఏపీ శాసనమండలిలో ఆ పార్టీకి 30 మంది ఎమ్మెల్సీల బలం ఉంది. దానిని పట్టుకునే జగన్ ధీమాతో ఉన్నారు. కానీ కొందరు ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో శాసనమండలి వైస్ చైర్ పర్సన్ సైతం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. కచ్చితంగా ఆ దిశగా చంద్రబాబు సైతం పావులు కదుపుతారని తెలుస్తోంది.

వైసీపీకి ఓటమి ఎదురైన వేళ జగన్ సమీక్షించారు. పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. పార్టీకి బలం తగ్గలేదని కూడా చెప్పుకొచ్చారు. బిల్లుల విషయంలో శాసనమండలి కీలకం అవుతుందని.. ఈ విషయంలో గట్టిగానే పోరాటం చేయాలని జగన్ పిలుపు ఇచ్చారు. అయితే అసెంబ్లీలో అంతులేని మెజారిటీ ఉన్న సమయంలో ఎమ్మెల్సీలను జగన్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఎమ్మెల్సీలు. ప్రస్తుతం శాసనమండలిలో వైసిపి కి 30 మంది, టిడిపికి 9 మంది, జనసేనకు ఒకరు, పిడిఎఫ్ కు ఇద్దరూ, నలుగురు ఇండిపెండెంట్ లు, మరో ఎనిమిది మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. ఇంకా నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరో రెండు సంవత్సరాల్లో కూటమి ఆధీనంలోకి శాసనమండలి రావడం ఖాయం. అయితే ఇంతలోనే మెజారిటీ ఎంపీలు వైసీపీ నుంచి చేజారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా శాసనమండలి వైస్ చైర్మన్ జాకీయా ఖానం పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కడప జిల్లా రాయచోటికి చెందిన ఖానాం తనకు పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదని గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. అలాగే మైనారిటీ వర్గానికి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ కోటా కింద ఎన్నికైన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీని వీడేందుకు సిద్ధపడినట్లు సమాచారం. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జాకీయా ఖానం.. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి ఫరూక్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. టిడిపిలో చేరేందుకు ఆమె ఆసక్తి చూపినట్లు సమాచారం.

ప్రస్తుతం శాసనమండలి పై చంద్రబాబు దృష్టి సారించారు. అమరావతి తో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి అంశాలపై శాసనమండలి ఆమోదం కీలకం. అందుకే జగన్ సైతం ధీమాతో ఉన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఎటువంటి బిల్లు పెట్టిన అడ్డుకునేందుకు పావులు కదుపుతారు. అందుకే చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో శాసనమండలిని తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా అసెంబ్లీలో అంతులేని మెజారిటీతో జగన్ ఉండేవారు. కనీసం శాసనమండలిని పట్టించుకునే వారు కారు. ఒకానొక దశలో శాసనమండలి రద్దుకు కూడా ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వెనక్కి తగ్గారు. పేరుకే ఎమ్మెల్సీలు కానీ.. వైసీపీ హయాంలో వారికి ఎటువంటి అధికారాలు కూడా లేవు. ఇటువంటి తరుణంలో మెజారిటీ ఎమ్మెల్సీలు టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అయితే దాదాపు 15 మంది వైసీపీ ఎమ్మెల్సీలను ఆకర్షించేందుకు అధికార టిడిపి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular