Pinnelli Ramakrishna Reddy: ఎట్టకేలకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గం లో విధ్వంసం చెలరేగిన సంగతి తెలిసిందే. పోలింగ్ నాడు, పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పటినుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అజ్ఞాతంలో ఉన్నారు. అయితే తాజాగా అల్లర్లపై సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో దర్యాప్తు కొనసాగింది. మాచర్ల నియోజకవర్గంలోని 200 పోలింగ్ కేంద్రాల్లో సిసి పుటేజీలను పరిశీలించారు. అందులో భాగంగా ఓ పోలింగ్ కేంద్రంలో దూరిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన బయటపడింది. దీనిపై సిట్ అధికారులు సీరియస్ అయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై అదనంగా కొన్ని సెక్షన్లను నమోదు చేయించారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ కు నివేదించడంతో.. ఈసీ సీరియస్ అయ్యింది. తక్షణం పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశించింది.
గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో తనిఖీ చేశారు. అయితే ఆయన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. విదేశాలకు పారిపోకుండా ఉండేందుకుగాను లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఓ ఫామ్ హౌస్ లో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉంది. బుధవారం సాయంత్రం లోగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ పోలీసులు సీరియస్ యాక్షన్ లోకి దిగారు. ముందుగా ఆయన సన్నిహితులు, కారు డ్రైవర్ను ట్రాప్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఓ ఫామ్ హౌస్ లో.. అరెస్టు చేసినట్లు సమాచారం. అక్కడ నుంచి ఏపీకి రోడ్డు మార్గం గుండా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఇంతవరకు ఏపీ పోలీసులు ధ్రువీకరించలేదు. మొత్తానికి అయితే ఏపీలో ఎన్నికల అల్లర్ల వ్యవహారం సరికొత్త టర్న్ తీసుకుంటోంది. ఏపీవ్యాప్తంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.