Ysr congress  : వైసిపి నేతల పోరాటానికి టైం కావాలట.. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారంటే?*

ఏపీలో వైసిపి దారుణంగా ఓడిపోయింది. ఊహించని ఓటమి ఎదురైంది. దాని నుంచి బయటపడేందుకు పడరాని పాట్లు పడుతోంది. అయితే ఇంకొంచెం సమయం తీసుకుని పోరాడుదామని వైసిపి సీనియర్లు చెబుతుండడంతో జగన్ కు మింగుడు పడడం లేదు

Written By: Dharma, Updated On : August 1, 2024 12:44 pm
Follow us on

Ysr congress : వైసీపీ క్యాడర్ ఒంటరి అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై దాడులు పెరుగుతున్నాయని నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు క్షీణించాయని కూడా చెబుతోంది.ఢిల్లీ వేదికగా పోరాటాలు కూడా చేసింది. పార్టీ శ్రేణులకు అండగా నిలబడతామని కూడా చెప్పుకొచ్చింది. అంతవరకు పరవాలేదు కానీ..ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసిపి నాయకులు కనీసం నియోజకవర్గం కూడా చూడడం లేదు. రివ్యూలు కూడా జరపడం లేదు.ఎన్నికల్లో అసలు లోపాలు ఎక్కడ జరిగాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. హై కమాండ్ ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన, జాతీయ స్థాయిలో పోరాటాలు చేసినందు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.క్షేత్రస్థాయిలో కార్యకర్తకు అండగా నిలబడేది నియోజకవర్గ నాయకుడే.జగన్ నుంచి కీలక నేతల పరామర్శలు, ప్రకటనలు వారిలో స్వాంతననింపడానికే. కానీ అండగా నిలిచి ప్రోత్సహిస్తేనే పార్టీ గురించి పోరాటం చేస్తారు పార్టీ శ్రేణులు. రాష్ట్రంలో మంత్రి పదవులు వెలగబెట్టిన 40 మంది వరకు నేతలు ఉంటారు. ఇతరత్రా పదవులు దక్కించుకున్న వారు దాదాపు 100 మంది వరకు ఉంటారు. కానీ ఏ ఒక్కరూ ఇప్పుడు వైసీపీకి అక్కరకు రాకుండా పోతున్నారు. చాలామంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.కనీసం పోటీ చేసిన వారు కూడా వ్యక్తిగత పనులకు పరిమితం అవుతున్నారు. నియోజకవర్గాలకు దూరంగా నగరాల్లో ఉంటూ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతోంది. భరోసా ఇచ్చే నాయకుడి కోసం ఎదురుచూస్తోంది.

* నిరాశ, నిస్పృహాలు
వైసీపీలో నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కొనసాగుతున్నాయి.ప్రత్యర్థులపై కంటే సొంత పార్టీ నాయకత్వం పైనే క్యాడర్లో అసంతృప్తి కనిపిస్తోంది.అటు నాయకుల సైతం నాయకత్వం తీరని ప్రశ్నిస్తున్నారు.తాజాగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే ఓ వీడియో విడుదల చేశారు. కోటది ప్రభుత్వానికి మరో ఆరు నెలల సమయం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. అప్పటివరకు వారి మీద విమర్శలు చేయడం సబబు కాదని కూడా చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు తీర్చమని కోరడం కూడా తప్పు అన్నట్టుగా మాట్లాడారు. హై కమాండ్ చేసిన తప్పులను కూడా గుర్తు చేశారు.గత ఐదేళ్లుగా జరిగిన తప్పిదాలను గుర్తుచేస్తూ మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

* ఆ నినాదంతో నష్టం అంటున్న నేతలు
జగన్ నోరు తెరిస్తే నా ఎస్సీలు,నా ఎస్టీలు,నా బీసీలు, నా మైనారిటీలు అంటూ స్లోగన్ ఇచ్చిన విషయాన్ని తప్పు పట్టారు కేతిరెడ్డి. వారు ఓట్లు వేసి ఉంటే వైసీపీ గెలిచేది అని.. జగన్ ఇచ్చిన ఈ నినాదంతో మిగతా సామాజిక వర్గాల్లో నెగిటివ్ అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ల ఇష్యూ తో సినీ పరిశ్రమకు వ్యతిరేకమయ్యాము. మద్యం, ఇసుక వంటివి ప్రభుత్వం నిర్వహించడం తప్పు. ప్రభుత్వం పాలనే చేయాలి కానీ..వ్యాపారం చేయకూడదు అంటూ కేతిరెడ్డి అధినేత జగన్ కు ఇచ్చి పడేశారు.

* నాయకత్వంపై విమర్శలు
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నర్మగర్భంగా మాట్లాడారు. సొంత పార్టీ మీద నిశిత విమర్శలు చేశారు. కూటమికి సమయం ఇవ్వాలని కోరారు. అయితే కూటమికి సమయం ఇస్తే.. పార్టీ క్యాడర్ చేజారిపోవడం ఖాయమని జగన్ ఆందోళనగా ఉన్నారు. అదే సమయంలో సీనియర్లు సైతం పట్టించుకోవడం లేదు. మీడియా ముందుకు వస్తున్న కేతిరెడ్డి లాంటి వాళ్లు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే జగన్కు ఏం చేయాలో పాలు పోవడం లేదు. మొత్తానికైతే వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. పదవులు అనుభవించిన వారు పక్కకు వెళ్ళిపోతున్నారు. అసంతృప్తి వాదులు ముందుకు వచ్చి అధినేతకు సలహాలు ఇస్తున్నారు.