Homeఆంధ్రప్రదేశ్‌YCP Leaders : గుమ్మం దాటని ఆ ముగ్గురు వైసీపీ సీనియర్లు!

YCP Leaders : గుమ్మం దాటని ఆ ముగ్గురు వైసీపీ సీనియర్లు!

YCP Leaders  : ఎన్నికలు( elections ) వస్తుంటాయి.. పోతుంటాయి. గెలుపోటములు కూడా సర్వసాధారణం. గెలిచినవారు ఓడిపోరని గ్యారంటీ లేదు.. ఓడినవారు తప్పకుండా గెలుపు కోసం ఆరాటపడుతుంటారు. అయితే దశాబ్దాలుగా రాజకీయం చేసిన ఆ ముగ్గురు నేతలు మాత్రం.. ఒకే ఒక ఓటమితో మూలకు చేరిపోయారు. సైలెంట్ గా ఉన్నారు. ఇంటి గడప దాటడం లేదు. వారే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు తమ్మినేని సీతారాం, ధర్మాన బ్రదర్స్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్న ఈ ముగ్గురు ఇప్పుడు పొలిటికల్ సైలెన్స్ పాటిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి సరిగ్గా ఏడాది అవుతున్నా.. పెద్దగా యాక్టివ్ కాలేకపోతున్నారు. దీంతో రాజకీయాలు వదిలేస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Also Read : వైసిపికి షాక్.. ఆ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

* సైడ్ అయిన తమ్మినేని..
తెలుగు రాష్ట్రాల్లోనే తమ్మినేని సీతారాం( speaker Sitaram) సీనియర్ మోస్ట్ లీడర్. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నుంచి 1983 నుంచి 1999 వరకు ప్రాతినిధ్యం వహించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి చేపట్టారు. అయితే 2004 నుంచి ఆయనకు వరుసగా ఓటములు ఎదురవుతున్నాయి. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు తమ్మినేని. ఆ ఎన్నికల్లో కూడా ఓటమి తప్పలేదు. తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో రెండోసారి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. స్పీకర్ పదవి పొందారు. 2024 ఎన్నికల్లో మూడోసారి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆయనను పక్కకు తప్పించారు. నియోజకవర్గ బాధ్యతలు వేరొకరికి అప్పగించారు. అప్పటినుంచి వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు తమ్మినేని.

* ధర్మాన ప్రసాదరావు మౌనం
ఇక ధర్మాన సోదరుల( dharmana brothers ) గురించి చెప్పనవసరం లేదు. 1989లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ధర్మాన ప్రసాదరావు. తొలిసారిగా నరసన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టడమే కాకుండా మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే 1994, 1999 లో కూడా గెలిచారు. 2004లో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కీలక రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు. అది మొదలు 2014 వరకు కీలక మంత్రిగా కొనసాగారు. ప్రత్యేక పరిస్థితుల్లో వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓటమి ఎదురైంది. 2019లో మళ్లీ గెలిచారు కానీ మంత్రి పదవి దక్కలేదు. దీంతో నైరాస్యంలోకి వెళ్లిపోయారు. జగన్ విస్తరణలో ఛాన్స్ ఇచ్చారు గాని యాక్టివ్ పాలిటిక్స్ చేయలేకపోయారు ధర్మాన ప్రసాదరావు. 2024 ఎన్నికల్లో ఓ సాధారణ సర్పంచ్ చేతిలో దారుణ పరాజయం చూశారు. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. గుమ్మం దాటి బయటకు అడుగు పెట్టడం లేదు.

* కృష్ణదాస్ సైతం..
మరో ధర్మాన సోదరుడు కృష్ణదాస్( Krishna Das) పరిస్థితి వింతగా ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి తన తొలి క్యాబినెట్ లోనే కృష్ణ దాస్ కు ఛాన్స్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు కృష్ణదాస్. ఫలితాల తర్వాత కూడా పార్టీలో యాక్టివ్ గా పని చేస్తూ వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పగ్గాలు కూడా తీసుకున్నారు. కానీ ఉన్నట్టుండి ధర్మాన కృష్ణ దాస్ సైతం రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అయితే కేసులకు భయపడి ఆయన మౌనం దాల్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో ఆ ముగ్గురు సీనియర్ల మౌనం ఇప్పుడు పార్టీకి శాపంగా మారుతుంది. ఆ ముగ్గురిని కాదని కొత్త వారితో రాజకీయం చేసే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదు. అలాగని వీరు క్రియాశీలకం కావడం లేదు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక అస్పష్టమైన వాతావరణం కనిపిస్తోంది.

Also Read : పోసానిపై మరో కేసు.. వదిలేదే లేదా? అసలేం జరిగింది?

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version